తెలంగాణ ఏర్పడినా పరిస్థితులలో మార్పు రాలేదా?

July 23, 2016


img

ఆంధ్రా పాలకులు రాష్ట్ర ప్రజలని, రాష్ట్రాన్ని దోచుకొన్నారని తెరాస నేతలు తరచూ ఆరోపిస్తుండటం అందరూ వింటూనే ఉంటారు. తెలంగాణ కోసం పోరాడిన తెరాసయే ఇప్పుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తోంది కనుక రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం జరుగుతూనే ఉందా? తెలంగాణలో అవినీతి, అక్రమాలు పూర్తిగా తొలగిపోయాయా? అంటే లేదని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. తెరాస ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులలో భారీ అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నాయి.

ప్రతిపక్షాలు ఎప్పుడూ రాజకీయ దురుద్దేశంతోనో లేక తమ రాజకీయ ప్రయోజనాల కోసమో ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉంటాయి కనుక వాటి విమర్శలని, ఆరోపణలని పట్టించుకోకపోయినా రాజకీయాలతో సంబంధం లేని ప్రొఫెసర్ కోదండరాం వంటి మేధావులు కూడా తెరాస పాలన పట్ల ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు? వారు కూడా ప్రతిపక్ష పార్టీల ప్రభావానికిలోనయ్యి విమర్శలు గుప్పిస్తున్నారని అనుకొంటే, హైకోర్టు కూడా చాలాసార్లు ప్రభుత్వాన్ని ఎందుకు తప్పు పడుతోంది?

ఉదాహరణకి ఈ తాజా తీర్పుని చూద్దాం. మెదక్ జిల్లాలో వెలిమల గ్రామంలోని కొందరు రైతుల పూర్వీకులు 1956-59 సం.ల మధ్య కాలంలో అప్పటి ప్రభుత్వం నుంచి తక్కావి రుణాలు తీసుకొన్నారు. ఆ తరువాత కాలంలో ఎప్పుడో వాటిని తిరిగి చెల్లించేశారు కూడా. కానీ ప్రభుత్వం ఆ భూములు వారి వారసులకి స్వాధీన పరచకుండా వారికి కౌలుకి ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయాన్ని అప్పుడే ఆ రైతులు గట్టిగా వ్యతిరేకించారు. ఆ తరువాత భూముల ధరలు విపరీతంగా పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ భూములని వేలానికి పెట్టింది.

అప్పుడు రైతులు మళ్ళీ హైకోర్టుని ఆశ్రయించారు కానీ సింగిల్ జడ్జ్ వారికి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. దానితో రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ వేలానికి సిద్ధపడింది. రైతులు మళ్ళీ హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్.బి.భోస్లే, జస్టిస్ వెంకట శేషసాయిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వారి పిటిషన్ పై నిన్న విచారణ జరిపింది.

ఇరు పక్షాల వాదోపవాదనలు విన్న తరువాత సింగిల్ జడ్జ్ కోర్టు ఇచ్చిన తీర్పుని కొట్టివేయడమే కాకుండా, రైతుల భూములని వారికి స్వాధీనం చేయకుండా వేలం వేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. అధికారంలో ఉన్నాము కదా అని ఇష్టం వచ్చినట్లు రైతుల భూములు లాక్కొందామని ప్రయత్నిస్తే సహించబోమని తెలంగాణ ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించింది. ప్రభుత్వ అధీనంలో ఉన్న ఆ భూములని తక్షణం వాటి యజమానులకి అప్పగించవలసిందిగా ఆదేశించింది.

హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి చెంప దెబ్బ వంటిదే. రాష్ట్ర ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఎంతగానో పరితపించిపోతున్నట్లుగా మాట్లాడే తెరాస ప్రభుత్వం మరి నిరుపేద రైతుల పట్ల ఈవిధంగా ఎందుకు వ్యవహరిస్తోంది? ఆరు దశాబ్దాల క్రితం వారి పూర్వీకులు తీసుకొన్న అప్పులని తీర్చివేసినప్పటికీ, సమైక్య రాష్ట్రాన్ని పాలించిన ఆంధ్రా పాలకులు వేధించి ఉండవచ్చు కానీ తెరాస ప్రభుత్వం కూడా వారిలాగే ఎందుకు రైతులని వేధిస్తోంది? హైకోర్టు కూడా తప్పు పట్టే విధంగా ఎందుకు వ్యవహరిస్తోంది?


Related Post