ఇంటర్ ఆపరేషన్ సక్సస్ బట్ స్టూడెంట్స్ లాస్ట్!

April 22, 2019


img

ఇంటర్ ఫలితాలపై విద్యార్దులు, వారి తల్లితండ్రులతో పాటు ఈసారి రాజకీయ పార్టీలు కూడా ఆందోళలకు దిగి బోర్డుపై తీవ్ర విమర్శలు కురిపిస్తుండటంతో బోర్డు కంటే ఎక్కువ ప్రభుత్వమే ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. దాంతో ఇంటర్ ఫలితాలలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపేందుకు త్రిసభ్య కమిటీని నియమించింది. అప్పటికి కానీ ఇంటర్ బోర్డులో కదలిక రాలేదు.

ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, నాంపల్లిలో తమ  కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్దులు, వారి తల్లితండ్రులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఇంటర్ బోర్డు ఎప్పుడూ అత్యంత సమర్ధంగా పారదర్శకంగా పనిచేస్తోంది. ఇంటర్ బోర్డుపై కొందరు పనికట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు. పరీక్షలు వ్రాయనివారిని పాస్ చేసినట్లు, వ్రాసినవారిని ఉద్దేశ్యపూర్వకంగా ఫెయిల్ చేసినట్లు వస్తున్న వార్తలలో నిజం లేదు. ఆ విధంగా చేయవలసిన అవసరం మాకు లేదు.  ఇంటర్ పరీక్షా పత్రాలు గల్లంతయ్యాయని వస్తున్న వార్తలలో కూడా నిజం లేదు. అన్నీ భద్రంగా ఉన్నాయి.

అర్హత కలిగిన అధ్యాపకుల చేతనే మూల్యాంకనం చేయించాము తప్ప మీడియాలో చెపుతున్నట్లు ఎవరో ప్రైవేట్ వ్యక్తులకు పరీక్షా పత్రాలను అప్పగించలేదు. పరీక్షా పత్రాల కంప్యూటరీకరణలో బయటవారెవరి జోక్యం ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే గ్లోబరీనా టెక్నాలజీ అనే సంస్థ సేవలు తీసుకొన్నాము. క్షేత్రస్థాయిలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లవలన కొందరు విద్యార్దులకు నష్టం కలిగిన మాట వాస్తవమే. వాటిని వెంటనే సరిదిద్ది విద్యార్దులకు న్యాయం చేస్తాము. ఈ పొరపాట్లు జరగడానికి కారకులైనవారికి మెమోలిచ్చి జరిమానాలు కూడా విధిస్తాము. విద్యార్దులు తమ పరీక్షా పత్రాలను మూల్యాంకనం చేయించుకొనేందుకు గడువు పెంచుతాము. కనుక విద్యార్దులు, వారి తల్లితండ్రులు మాతో సహకరించవలసిందిగా కోరుతున్నాను,” అని చెప్పారు.  

పెద్ద వ్యవస్థలలో అప్పుడప్పుడు తెలిసీతెలియక కొన్ని తప్పులు జరగడం సహజం. ఇంటర్ బోర్డులో కూడా జరిగాయని పరీక్షా ఫలితాలే స్పష్టం చేస్తున్నప్పుడు, ఆ సమస్యను వెంటనే గుర్తించి సవరించుకొంటామని అశోక్ చెప్పి ఉండాలి. కానీ ఇప్పటికీ అంతా సవ్యంగానే ఉందని గట్టిగా సమర్ధించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మాటలు‘ఆపరేషన్ సక్సస్ బట్ పేషెంట్ డెడ్’ అన్నట్లున్నాయి. ఆయన చెప్పిందే నిజమైతే ఈసారి ఏకంగా 4 లక్షల మంది విద్యార్దులు ఎందుకు ఫెయిల్ అయ్యారు? వారిలో మెరిట్ స్టూడెంట్స్ కూడా ఎందుకున్నారు? విద్యార్దులు, వారి తల్లితండ్రులు పనిలేకనే ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఆందోళనలు చేస్తున్నారా?మూల్యాంకనంపై ఇంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేస్తున్నప్పుడు, ఒకసారి పరిశీలించుకొని తప్పులు ఉంటే సరిద్దికోవడానికి ఇంటర్ బోర్డుకు అభ్యంతరం దేనికి? అని విద్యార్దులు, వారి తల్లితండ్రులు ప్రశ్నిస్తున్నారు.


Related Post