చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే!

April 20, 2019


img

గత ఎన్నికలలో కేవలం నరేంద్రమోడీని చూసే ప్రజలు బిజెపికి ఓటువేసి అధికారం కట్టబెట్టారు. ఈసారి ఎన్నికలలో కూడా నరేంద్రమోడీ కారణంగానే ఓట్లు పడబోతున్నాయి కానీ బిజెపికి వ్యతిరేకంగా! మోడీ సర్కారు చాలా మంచి ఉద్దేశ్యంతోనే పెద్దనోట్లు రద్దు చేసినప్పటికీ, దాని వలన కోట్లాదిప్రజలు అష్టకష్టాలు పడ్డారు. అనేకమంది జీవనోపాధి కోల్పోయారు. చిరువ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ఆ దెబ్బ నుంచి వారు తేరుకోకమునుపే మోడీ సర్కారు హడావుడిగా జిఎస్టీని ప్రవేశపెట్టడంతో చిరువ్యాపారులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. 

జిఎస్టీతో కేంద్రప్రభుత్వ ఆదాయం బారీగా పెరిగినప్పటికీ వ్యాపారులు... ముఖ్యంగా చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ రెండు నిర్ణయాలే దేశంలో కోట్లాదిమంది ప్రజలకు మోడీ ప్రభుత్వం పట్ల ఆగ్రహం కలిగించిందని చెప్పవచ్చు. గుజరాత్ అంటే వ్యాపారానికి పెట్టింది పేరు. కనుక నోట్ల రద్దు, జీఎస్టీలవలన గుజరాతీ వ్యాపారస్తులు ఎక్కువగా నష్టపోవడం సహజం. కనుక వారందరూ ఈ ఎన్నికలలో బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉంది. అందుకే బిజెపికి కంచుకోట వంటి గుజరాత్ రాష్ట్రంలో కూడా ఈసారి బిజెపి ఎదురీదవలసి వస్తోంది. 

ఈవిషయం ప్రధాని నరేంద్రమోడీ కూడా బాగానే గ్రహించినట్లున్నారు. కనుక ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి నేతలు వ్యాపారులను ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఒక ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ, “దేశా ఆర్ధిక పరిస్థితి ఇంత బలంగా ఉండటానికి ప్రధానకారణం వ్యాపారస్తులే. వారి సహాయ సహకారాలతోనే దేశ ఆర్ధిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్స్ స్థాయికి చేరుకోగలిగింది. కనుక వ్యాపారులకు మేలు చేసేందుకు మా ప్రభుత్వం సుమారు 1500 పాత చట్టాలను రద్దు చేసి, సరళమైన చట్టాలను రూపొందించింది. మళ్ళీ మేము అధికారంలోకి వస్తే జాతీయ వ్యాపార సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తాము. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొనేవారికి ఎటువంటి పూచీకత్తు లేకుండా రూ.50 లక్షల వరకు రుణాలు ఇప్పిస్తాము. మా ప్రభుత్వం వ్యాపారులకు అండగా నిలబడి వారికి అన్ని విధాలా సహకరిస్తుంది,” అని అన్నారు. 

అధికారంలో ఉన్నప్పుడు ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని వాటిని దేశప్రజలపై బలవంతంగా రుద్ది, ఇప్పుడు ఎన్నికలలో దేశప్రజలను ఈవిధంగా బ్రతిమాలుకోవడం వలన ఏమి ప్రయోజనం? చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనేమో?


Related Post