కాంగ్రెస్‌ ఉపాయం ఫలిస్తుందా?

April 17, 2019


img

ఎన్నికలలో అన్ని పార్టీలు హోరాహోరీగా పోరాడుతుంటాయి. అది చాలా సహజం. కానీ ఎన్నికలలో గెలిచిన ప్రతిపక్ష ఎంపీల మొదలు వార్డు మెంబర్లవరకు అధికార తెరాసలోకి ఫిరాయించడం కూడా సర్వసాధారణమైన విషయమైపోయింది. అంటే కష్టం ప్రతిపక్షాలది...ఫలితం పొందేదీ తెరాస అన్నట్లవుతోంది. ప్రజలు ఏ పార్టీకి ఓటేసి గెలిపించినా అంతిమంగా తెరాస లబ్ది పొందుతోంది. పార్టీ ఫిరాయిస్తున్న ప్రజాప్రతినిధులు తాము రాష్ట్రాభివృద్ధి కోసమో లేదా తమ నియోజకవర్గం అభివృద్ధి కోసమో తెరాసలో చేరుతున్నామని చెప్పుకొంటున్నప్పటికీ, వారు ప్రలోభాలకు తలొగ్గి పార్టీ ఫిరాయిస్తున్నారనే సంగతి అందరికీ తెలుసు. 

ఈ ఫిరాయింపులకు మొట్టమొదట టిడిపి బలైపోయి రాష్ట్రంలో నామరూపాలు లేకుండా పోయింది. దాని తరువాత కాంగ్రెస్ పార్టీ బలైపోతోంది. ఈ ఫిరాయింపులను కట్టడి చేయకపోతే ఏదో ఒకరోజు కాంగ్రెస్ పార్టీ కూడా టిడిపిలాగే కనుమరుగయ్యే ప్రమాదం ఉందని కాంగ్రెస్‌ నేతలు బాగానే గ్రహించారు. కానీ ఫిరాయింపులను అడ్డుకోవలసిన చట్టాలు, వ్యవస్థలు చేతులు ముడుచుకొని చూస్తున్నందున వాటిని ఏవిధంగా అడ్డుకోవాలో తెలియక కాంగ్రెస్‌ నేతలు తలలు పట్టుకొన్నారు. 

ఈ సమస్యకు తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, కరీంనగర్‌ లోక్‌సభ అభ్యర్ధి పొన్నం ప్రభాకర్‌ ఒక పరిష్కారాన్ని కనుగొని దానిని ఆయనే ముందుగా ఆచరించి చూపారు. అదేమిటంటే, తాను లోక్‌సభ ఎన్నికలలో గెలిస్తే ఎట్టి పరిస్థితులలో పార్టీ మారబోనని, మారినట్లయితే తనపై క్రిమినల్ కేసు పెట్టి చర్యలు తీసుకోవచ్చునని లిఖితపూర్వకంగా స్టాంప్ పేపరుపై అఫిడవిట్  రూపంలో హామీ ఇచ్చారు. త్వరలో జరుగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్ధుల నుంచి కూడా ఇదే విధంగా అఫిడవిట్లు తీసుకొంటే ఫిరాయింపులను నివారించవచ్చునని పొన్నం ప్రభాకర్‌ సూచిస్తున్నారు. 

బుదవారం ఉదయం గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు సమావేశం కానున్నారు. ఆ సమావేశంలో పరిషత్ ఎన్నికల ఏర్పాట్లు, అభ్యర్ధుల ఎంపికతో పాటు పొన్నం సూచనపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ప్రతిపాదనను అంగీకరిస్తే, ముందుగా పార్టీలో మిగిలిన 9 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేసినవారు అఫిడవిట్లు ఇస్తే వారు చేజారిపోకుండా కాపాడుకోవచ్చు. కానీ ఈ ఉపాయం ఫలిస్తుందా లేక దీనికి కూడా తెరాస ప్రత్యుపాయం అమలుచేస్తుందా? చూడాలి.


Related Post