కేసీఆర్‌ ఆరాటమంతా కేంద్రమంత్రి పదవుల కోసమే! లక్ష్మణ్

April 16, 2019


img

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె. లక్ష్మణ్ సిఎం కేసీఆర్‌పై మళ్ళీ విమర్శలు గుప్పించారు. “ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి 16 ఎంపీ సీట్లు గెలుచుకొని కేంద్ర ప్రభుత్వంలో మంత్రిపదవులు సంపాదించుకోవాలని కేసీఆర్‌ కలలు కంటున్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా తెరాస నేతలు వేలకోట్లు ఖర్చు చేస్తున్నారు. అంతా డబ్బు వారికి ఎక్కడి నుంచి వస్తోంది? రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, గ్రామాలలో బెల్ట్ షాపులు పెరిగిపోయాయి. ఎవరైనా ప్రశ్నిస్తే భౌతిక దాడులు చేస్తున్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఇందిరమ్మ ఇళ్ళు పేరు చెప్పుకొని కాంగ్రెస్‌ నేతలు ప్రజాధనం దోచుకొన్నారని కేసీఆర్‌ చెపుతుంటారు. మరి 5 ఏళ్ళు గడిచిపోయినా వారిపై ఇంతవరకు ఎందుకు విచారణ జరిపించలేదు? వారిని తెరాసలో చేర్చుకొనేందుకేనా?

గతంలో 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించేసి ఎన్నికలు నిర్వహిస్తూ, బడుగు బలహీనవర్గాలకు న్యాయం చేస్తామని చెప్పడం మోసం కాదా? కేవలం 6 శాతం జెడ్పీ స్థానాలు మాత్రమే బీసీలకు కేటాయించారు. కేసీఆర్‌ చేస్తున్న ఈ మోసాలను బీసీలు గమనించాలని కోరుతున్నాను. మండలి ఎన్నికలలో తెరాస ఓడిపోయినప్పటికీ కేసీఆర్‌కు ఇంకా కనువిప్పు అయినట్లు లేదు. సిఎం కేసీఆర్‌ కేవలం రాజకీయ దురుదేశ్యంతోనే గడువు కంటే ముందుగా పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు,” అని లక్ష్మణ్ అన్నారు. 

లోక్‌సభ ఎన్నికలలో 16 ఎంపీ సీట్లు గెలుచుకొని ఫెడరల్‌ ఫ్రంట్‌తో కేంద్రంలో చక్రం తిప్పుతానని సిఎం కేసీఆర్‌ వాదిస్తుంటే, (మోడీ ప్రభుత్వంలో?) కేంద్రమంత్రి పదవులు పొందాలని కేసీఆర్‌ కలలు కంటున్నారని లక్ష్మణ్ చెప్పడం ఆసక్తికరంగా ఉంది. 

లోక్‌సభ ఎన్నికల తరువాత తమకు అవసరమున్నా లేకున్నా తమతో కలిసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకుపోతామని బిజెపి చెపుతోంది. అంటే కేసీఆర్‌కు కూడా ఆహ్వానం ఉన్నట్లే భావించవచ్చు. కానీ ప్రధాని పదవి చేపట్టి దేశాన్ని తనదైన శైలిలో ముందుకు నడిపించాలనుకొంటున్న కేసీఆర్‌, లక్ష్మణ్ చెప్పినట్లు కేంద్రమంత్రి పదవితో సరిపెట్టుకొంటారా లేక ప్రాంతీయ పార్టీలను కూడగట్టి ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా? అనేది మే 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత తెలుస్తుంది.


Related Post