అవన్నీ ఓటమి కోసం ఏర్పాట్లే: కేటీఆర్‌

April 13, 2019


img

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, టిడిపి అనుకూల మీడియాపై తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “చంద్రబాబునాయుడుకి తాము ఓడిపోబోతున్నామనే సంగతి అర్ధమైంది. అందుకే ఆయన, టిడిపిని సమర్ధించే పచ్చమీడియాతో కలిసి సరికొత్త డ్రామాలు మొదలుపెట్టారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక నవ్వులపాలవకుండా తమను తాము కాపాడుకొనేందుకే ఇప్పటి నుంచే తమ వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ కొత్త డ్రామాలను రక్తి కట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఇవేవీ టిడిపిని కాపాడలేవు,” అని ట్వీట్ చేశారు. 

చంద్రబాబునాయుడు శనివారం డిల్లీ వెళ్ళి అక్కడ కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ సునీల్ అరోరా, ఇతర కమీషనర్లను కలిసి రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా జరిగిన అవకతవకల గురించి వివరించారు. అనంతరం అక్కడ వివిద పార్టీల నేతలను కలుసుకొని వారికి కూడా ఈ అవకతవకల గురించి వివరించనున్నారు. 

ఒకవేళ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో ఒకవేళ టిడిపి ఓడిపోతే డిల్లీలో ఉండే ఉత్తరాది పార్టీలు ఏవీ ఆయనను పట్టించుకోకపోవచ్చు కనుక అటువంటి ప్రమాదం రాకుండా వాటిని కూడా ముందే మానసికంగా సిద్దం చేస్తున్నారనుకోవచ్చు. కానీ టిడిపి ఓడిపోతే రాష్ట్రంలో వైసీపీ చేతిలో, తెలంగాణలో కేసీఆర్‌, కేటీఆర్‌, తలసాని తదితర  తెరాస నేతల చేతిలో చంద్రబాబునాయుడు, నారా లోకేష్‌, టిడిపి నేతలకు పరాభవాలు తప్పకపోవచ్చు. 


Related Post