హన్మంతన్నకు కోపం వచ్చింది

April 13, 2019


img

తెలంగాణ కాంగ్రెస్‌లో వి.హనుమంతరావు చాలా సీనియర్ నేత. పార్టీని వెనకేసుకురావడంలో...నెహ్రూ కుటుంబానికి విధేయత చాటుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. కానీ గత 10 ఏళ్లుగా పార్టీలో ఆయన ప్రాధాన్యత క్రమంగా తగ్గిపోయినట్లు కనిపిస్తోంది. రాష్ట్ర రాజకీయాలలో ఫిరాయింపులు, మైండ్ గేమ్స్ వంటి అనూహ్య ధోరణులు, ఎన్నికలలో డబ్బు ప్రాధాన్యం పెరిగిపోవడం వంటి అనేక కారణాల చేత పాతతరానికి చెందిన ఆయన వర్తమాన రాజకీయాలలో ఇమడలేకపోతున్నారు. అయినప్పటికీ తన పాతధోరణిలోనే రాజకీయాలు చేయాలనుకోవడం వలన ఆయనను పార్టీలో పక్కన పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. పార్టీకి ఎంతో కీలకమైన లోక్‌సభ ఎన్నికలలో వి.హనుమంతరావు పెద్దగా కనిపించకపోవడమే ఇందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 

అపార రాజకీయ అనుభవడైన వి.హనుమంతరావుకు ఇవన్నీ తెలియవనుకోలేము. కానీ కాంగ్రెస్ ఆయన జీవితంలో భాగంగా, కాంగ్రెస్‌ సంస్కృతి ఆయన జీవనవిధానంగా మారిపోయినందున ఎన్ని ఒడిదుడుకులు, తిరస్కారాలు ఎదుర్కొంటున్నప్పటికీ పార్టీనే అంటిపెట్టుకొని ఉండిపోయారు. కానీ అప్పుడప్పుడు ఆయన కూడా పార్టీ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. 

హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలే అంచలంచాలుగా ఎదిగి ఉన్నతపదవులు పొందేవారు. కానీ ఇప్పుడు బయట నుంచి వచ్చినవారికీ, బాగా డబ్బున్నవారికే పార్టీలో పదవులు, టికెట్లు లభిస్తున్నాయి. ఈ కారణంగా పార్టీ జెండాను మోస్తున్న నిజమైన కార్యకర్తలకు పార్టీలో చాలా అన్యాయం జరుగుతోంది. వారు ఎప్పటికీ జెండాలు మోసేవారిగానే మిగిలిపోతున్నారు. ఇది మా ఒక్క పార్టీ సమస్యే కాదు... అన్ని పార్టీలలో ఇదే సమస్య నెలకొని ఉంది. అన్ని పార్టీలు బాగా డబ్బున్న వారికే టికెట్లు ఇస్తున్నాయి కనుక ఇప్పుడు సామాన్యులు ఎవరూ ఎన్నికలలో పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు రాష్ట్రంలో కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలలో అగ్రకులాల అధిపత్యమే నడుస్తోంది. బడుగు బలహీనవర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు రాజకీయంగా ఎదిగేందుకు అవకాశమే లభించడంలేదు,” అని అన్నారు. Related Post