బి.ఎస్.పి. బాగానే హైప్ క్రియేట్ చేసింది

July 22, 2016


img

బి.ఎస్.పి.అధినేత్రి మాయావతి గురించి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ భాజపా ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ అనుచితంగా మాట్లాడినందుకు ఆ పార్టీ పార్లమెంటులో, బయటా ఎంత దుమారం సృష్టించిందో అందరూ చూసే ఉంటారు. బి.ఎస్.పి. ధాటికి తట్టుకోలేక దయాశంకర్ సింగ్ ని భాజపా నుంచి సస్పెండ్ చేయవలసి వచ్చింది. అయినప్పటికీ బి.ఎస్.పి. ఆగ్రహం చల్లార లేదు. దయాశంకర్ సింగ్ ని అరెస్ట్ చేయాలంటూ ఉత్తరప్రదేశ్ లో పలు నగరాలలో బి.ఎస్.పి. కార్యకర్తలు ర్యాలీలు, ధర్నాలు చేసారు. వారి ఒత్తిడికి తట్టుకోలేక దయాశంకర్ సింగ్ పై లక్నో పోలీసులు కేసు నమోదు చేశారు. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన ఆయనని వీలైనంత త్వరగా వెతికి పట్టుకొని అరెస్ట్ చేస్తామని పోలీసులు హామీ ఇచ్చిన తరువాతనే బి.ఎస్.పి. శాంతించి ఆందోళన విరమించింది. కానీ త్వరలో అతనిని అరెస్ట్ చేయకపోతే మళ్ళీ ఆందోళన చేస్తామని హెచ్చరించింది.  

ఈ వ్యవహారం క్రమంగా వేడెక్కుతోందని గ్రహించిన వెంటనే భాజపా దయాశంకర్ సింగ్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఎందుకంటే బి.ఎస్.పి.కి భయపడి కాదు. ఈ వ్యవహారం ఇంకా ముదిరితే వచ్చే ఏడాది జరుగనున్న శాసనసభ ఎన్నికలలో భాజపాపై ఆ ప్రభావం పడుతుందనే భయంతోనే కావచ్చు. మాయావతిని అవమానించడం అంటే రాష్ట్రంలో దళితులని అందరినీ అవమానించినట్లేనని బి.ఎస్.పి.ఆందోళన ద్వారా సంకేతాలు పంపుతున్నప్పుడు, భాజపా చూస్తూ ఊరుకోలేదు కనుకనే తక్షణమే దయాశంకర్ సింగ్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిందని భావించవచ్చు. భాజపా ఏ ఉద్దేశ్యంతో ఆయనని సస్పెండ్ చేసిందో, బి.ఎస్.పి. కూడా అదే ఉద్దేశ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేప్పట్టిందని చెప్పక తప్పదు. తమ అధినేత్రి పట్ల అనుచితంగా మాట్లాడినందుకు నిరసనగానే ఆందోళన చేసినప్పటికీ ఆ పార్టీ కూడా ఎన్నికలని దృష్టిలో పెట్టుకొనే ఇంత హడావుడి చేసి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 


Related Post