మైనారిటీల ఓట్ల కోసమే భాజపాపై కేసీఆర్‌ విమర్శలు: కిషన్ రెడ్డి

March 20, 2019


img

బిజెపి హిందుత్వ అజెండాతో రాజకీయాలు చేస్తోందంటూ సిఎం కేసీఆర్‌ చేసిన విమర్శలను బిజెపి నేత కిషన్ రెడ్డి తిప్పికొట్టారు. “బిజెపిని విమర్శిస్తే ముస్లిం ప్రజలు తెరాసకు ఓట్లేస్తారని కేసీఆర్‌ పగటికలలు కణుతున్నారు. అందుకే హటాత్తుగా హిందూత్వానికి కొత్త నిర్వచనాలు చెపుతున్నారు. హిందుత్వమంటే ఇంట్లో దేవుడు ఫోటోలు పెట్టుకోవడం, యాగాలు చేయడం కాదు. యాగాలు చేసి కేసీఆర్‌ తనంత గొప్ప హిందుత్వవాది ఎవరూ లేరన్నట్లు మాట్లాడుతున్నారు కానీ ఆయన పక్కన ఎవరున్నారో...తెరాసకు మిత్రపక్షం ఏదో అందరూ చూస్తూనే ఉన్నారు. కేసీఆర్‌కు ఎల్లప్పుడూ ఓట్లు, సీట్లు యావే తప్ప మరొకటి లేదు. కేవలం ఇద్దరు ఎంపీలతో తెలంగాణ సాధించానని కేసీఆర్‌ గొప్పలు చెప్పుకొంటున్నారు. మరి తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానాలు చేసుకొన్న 1,500 మంది యువకుల మాటేమిటి? 15ఎంపీలతో ఏమి సాధించలేనప్పుడు 16ఎంపీలతో ఏవిధంగా ఏమి సాధిస్తారో కేసీఆర్‌ ప్రజలకు చెప్పగలరా?” అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 

విచిత్రమేమిటంటే లోక్‌సభ ఎన్నికల తరువాత మళ్ళీ నరేంద్రమోడీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మద్దతు కూడగట్టడానికే కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తున్నారని కాంగ్రెస్‌ వాదిస్తోంది. గత 5 ఏళ్ళుగా నరేంద్రమోడీకి కష్ట సమయంలో కేసీఆర్‌ అండగా నిలబడ్డారు కనుక కాంగ్రెస్‌ వాదనలో ఎంతో కొంత నిజముందనే భావించవచ్చు. కానీ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీని, కేంద్రప్రభుత్వాన్ని, బిజెపిలను కేసీఆర్‌ తీవ్రంగా విమర్శిస్తుంటే వాటికి బిజెపి నేతలు కూడా ఈవిధంగా ఘాటుగా ప్రతివిమర్శలు చేస్తూ తాము నిజంగానే ఆగర్భశత్రువులమన్నట్లు కత్తులు దూసుకొంటున్నారు. కనుక కాంగ్రెస్‌ వాదిస్తున్నట్లు లోక్‌సభ ఎన్నికల తరువాత తెరాస, బిజెపిలు మళ్ళీ ఏకం అవుతాయా లేక కేసీఆర్‌ నిజంగానే కాంగ్రెస్‌, బిజెపిలకు సమానదూరంలో ఉంటారా? అనేది మరొక రెండుమూడు నెలలో తేలిపోతుంది. కానీ ఎన్నికలయ్యేవరకు ఈ డమ్మీ యుద్దాలు కొనసాగుతూనే ఉంటాయి కనుక వాటి అంతర్యాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తుండాలి. 


Related Post