అయితే కేసీఆర్‌ కాంగ్రెస్‌, బిజెపిలకు దూరంగా ఉంటారా?

March 20, 2019


img

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న బహిరంగసభలో సిఎం కేసీఆర్‌ కాంగ్రెస్‌, బిజెపిలపి తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. ఆయన ఆవేశం చూస్తే ఆ రెండు పార్టీలను బద్ధశత్రువులన్నట్లు మాట్లాడుతున్నారు. వాటి అనాలోచిత, అసమర్ధ, అవినీతి పాలన కారణంగానే దేశం అభివృద్ధి సాధించలేకపోయిందని కనుక వాటిని తరిమికొట్టాలని ప్రజలను కోరుతున్నారు. కాంగ్రెస్‌, బిజెపిలను ఇంత తీవ్రంగా విమర్శిస్తున్న కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికల తరువాత ఆ రెండు పార్టీలలో ఏదో ఒక దానికి ప్రభుత్వం ఏర్పాటుకు తెరాస మద్దతు అవసరమైతే ఇవ్వకుండా ఉంటారా? అంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వకపోవచ్చునేమో కానీ బిజెపికి అవసరమైతే తప్పకుండా మద్దతు ఇస్తారనే సంగతి అందరికీ తెలుసు. నరేంద్రమోడీకి పరిపాలన చేతకాదని ఆక్షేపిస్తున్న కేసీఆర్‌ రేపు అదే నరేంద్రమోడీకి మద్దతు ఈయవలసి వస్తే అప్పుడు తెలంగాణ ప్రజలకు ఏమి సమాధానం చెపుతారు?

కాంగ్రెస్, బిజెపిల వలన దేశానికి, రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదని గట్టిగా వాదిస్తున్నప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను, పార్టీ నేతలను తెరాసలోకి ఎందుకు ఫిరాయింపజేసుకొంటున్నారు? అనే సందేహం కలుగకమానదు. ‘లోక్‌సభ ఎన్నికల తరువాత ఏమి చేస్తానో చూడండి..‘ అంటూ ప్రజలను ఊరిస్తూ 16 సీట్లు కోరుతున్న సిఎం కేసీఆర్‌, కాంగ్రెస్‌, బిజెపిలకు తెరాస మద్దతు అవసరమైతే ఇస్తారో లేదో స్పష్టంగా చెపితే అందరూ హర్షించేవారు కదా?   Related Post