ఉత్తమ్‌..గుత్తా..ఎవరు గెలుస్తారో?

March 20, 2019


img

ఇల్లలకగానే పండగకాదన్నట్లు ఎన్నికలలో టికెట్ సాధించుకోగానే విజయం సాధించినట్లు కాదు. కారణాలు ఏవైతేనేమీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ నుంచి లోక్‌సభకు సిద్దం అవుతున్నారు. కనుక తెరాస కూడా ఆయనకు ధీటైన అభ్యర్ధినే సిద్దం చేసింది. ఆయనే నల్గొండ సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. జిల్లాపై కోమటిరెడ్డి సోదరులకు ఎంత పట్టు ఉందో ఆయనకు అంతే ఉంది. పైగా తెలంగాణ రైతు సమన్వయ సమితి ఛైర్మన్ హోదాలో జిల్లాలో రైతుబందు పధకం అమలుచేసి రైతులకు దగ్గరయ్యారు. ఇక సిఎం కేసీఆర్‌, అధికార పార్టీ అందండలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించినప్పటికీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం హుజూర్ నగర్ నుంచి విజయం సాధించగలిగారు. కనుక ఈ ఎన్నికలలో ఆయనను తెరాస ఓడించగలిగితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ కొట్టినట్లే అవుతుంది. కనుక ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఓడించేందుకు తెరాస గట్టి ప్రయత్నాలే చేయవచ్చు. 

అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా జిల్లాపై మంచి పట్టే ఉంది. జిల్లాలో పార్టీ శ్రేణులు కూడా చాలా చురుకుగానే ఉన్నాయి. ఈ ఎన్నికలలో కూడా తెరాస అభ్యర్ధిని ఓడించగలిగితే పార్టీపై పట్టు నిలుపుకోవచ్చు. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేంద్రమంత్రి పదవి లభించినా ఆశ్చర్యపోనక్కరలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది కనుక ఈ ఎన్నికలలో గెలిస్తే కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాకపోయినప్పటికీ, తెలంగాణలో పార్టీ బాధ్యతలు ఎవరికో ఒకరికి అప్పజెప్పేసి హాయిగా డిల్లీ వెళ్ళివచ్చు. కనుక ఆయన కూడా గట్టిగానే పోరాడవచ్చు. కనుక ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌-తెరాస మద్య పోరు చాలా భీకరంగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి.


Related Post