నిజామాబాద్‌లో కవితతో పోటీ పడేదెవరో తెలుసా?

March 18, 2019


img

తెరాస ఎంపీ కవిత మళ్ళీ నిజామాబాద్‌ నుంచే లోక్‌సభకు పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌, బిజెపి అభ్యర్ధుల నుంచి ఎలాగూ ఆమెకు పోటీ ఉంటుంది. ఈసారి ఆమె జిల్లా రైతులను కూడా ఎదుర్కోవలసివచ్చేలా ఉంది. జిల్లాలోని పసుపు, ఎర్రజొన్న రైతులు తమ పంటలకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ నెలరోజులుగా దీక్షలు, ధర్నాలు చేస్తున్నా ఆమె పట్టించుకోకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. కనుక ఆమెకు విన్నూత్నంగా నిరసనలు తెలుపాలని నిర్ణయించారు.

జిల్లాలోని ఒక్కో గ్రామం నుంచి కనీసం ఐదుగురు చొప్పున నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి నామినేషన్లు వేయాలని నిర్ణయించుకొన్నారు. వారిలో కొందరు ఎన్నికల బరిలో నిలిచి పోరాడేందుకు కూడా సిద్దం అవుతున్నారు. వారికి మిగిలిన రైతులందరూ ఓట్లు వేసి సహకరించాలని నిర్ణయించారు. జిల్లాలోని వేల్పూర్ మండలంలోని గ్రామాల రైతులు సోమవారం ఉదయం నామినేషన్ పత్రాల కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను తీర్చినట్లయితే నామినేషన్ల దాఖలుపై పునరాలోచిస్తామని లేకుంటే పోటీకి కూడా వెనుకాడబోమని చెప్పారు.


Related Post