కేసీఆర్‌ అందించింది ఆయుధమా...ఎరా?

March 18, 2019


img

సిఎం కేసీఆర్‌ నిన్న కరీంనగర్‌ బహిరంగసభలో ప్రసంగిస్తూ జాతీయరాజకీయాల కోసం అవసరమైతే జాతీయపార్టీని స్థాపిస్తానని ఓ కొత్త మాట చెప్పారు. దానిపై కాంగ్రెస్ నేతలు దానిపై స్పందిస్తున్నారు. 

రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ, “ఎవరైనా ఎన్నికలకు ముందు పార్టీని స్థాపించి దాంతో ఎన్నికలలో పోటీ చేయాలనుకొంటారు. కానీ సిఎం కేసీఆర్‌ ఎన్నికలైపోయాక పార్టీని స్థాపిస్తానని చెపుతున్నారు. దాని వలన ఏమి ప్రయోజనమో తెలియదు కానీ ప్రజలను మభ్యపెట్టేందుకు కేసీఆర్‌ మరో కొత్త నాటకం మొదలుపెట్టారు,” అని అన్నారు.     

సీనియర్ కాంగ్రెస్‌ నేత షబ్బీర్ ఆలీ స్పందిస్తూ, “కేసీఆర్‌ ప్రతిపాదించిన ఫెడరల్‌ ఫ్రంట్‌లో చేరేందుకు ఎవరూ సిద్దంగా లేనందునే ఈ కొత్త రాగం ఆలపించడం మొదలుపెట్టారు. కేసీఆర్‌ ఇక్కడ నరేంద్రమోడీని తిట్టిపోస్తుంటారు. కానీ డిల్లీ వెళ్లినప్పుడు ఆయన కాళ్ళకు మొక్కుతుంటారు. 15 ఎంపీలతో ఏమీ సాధించలేనప్పుడు, 16 ఎంపీలతో కేసీఆర్‌ ఏమి సాధించగలరు? వారితో ఏమీ సాధించలేకపోయినా మోడీ ప్రభుత్వం తీసుకొన్న నోట్లరద్దు, జిఎస్టి, నీతి ఆయోగ్ వంటి ప్రతీ నిర్ణయానికి మద్దతు పలికారు. జనాలను ఒక్కసారి మోసం చేయవచ్చునేమో కానీ పదేపదే మోసగించలేరు,” అని అన్నారు. 

జాతీయపార్టీ స్థాపిస్తాననే మాట కాంగ్రెస్‌ నేతలకు కేసీఆర్‌ని విమర్శించడానికి మంచి ఆయుధంగా పనికి వస్తోందని అర్దమవుతోంది. అయితే ఆ విషయం తెలియకనే కేసీఆర్‌ జాతీయపార్టీ ప్రతిపాదన చేశారనుకోలేము. కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ లేదా జాతీయపార్టీ స్థాపించకపోయినా తెలంగాణాకు, ప్రజలకు వచ్చే నష్టమేమీ ఉండదు. అలాగే ఎన్నికల తరువాత ఆయన మోడీకి మద్దతు ఇస్తారా లేక తనే చక్రం తిప్పుతారా?అనే విషయం కూడా ప్రజలు పెద్దగా పట్టించుకోకపోవచ్చు కానీ ఫెడరల్‌ ఫ్రంట్‌ లేదా జాతీయపార్టీతో తెలంగాణకు దేశానికి ఏదో మేలు జరుగుతుందనే ప్రజలకు నమ్మకం కల్పించగలిగితే వారు తప్పకుండా 16 సీట్లు తెరాసకే కట్టబెడతారు. ఈ సంగతి కాంగ్రెస్‌, బిజెపి నేతలకు కూడా బాగానే అర్ధమైంది. కానీ తెరాసను కాదని తమనే గెలిపించాలని చెప్పుకోవడానికి వారివద్ద బలమైన కారణం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్‌ నేతలు కేసీఆర్‌ వ్యూహాన్ని ఏవిధంగా ఎదుర్కోవాలో తెలియక ఈవిధంగా విరుచుకుపడుతున్నారని చెప్పవచ్చు. 

అదీగాక తెరాసకు పూర్తి మెజార్టీ ఉన్నపప్పకీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తెరాసలోకి ఫిరాయింపచేస్తుండటాన్ని ఎవరూ హర్షించలేరు. ఈ అంశంపై కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న విమర్శలు ప్రజలను కూడా ఆలోచింపజేస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఫిరాయింపుల కారణంగా తెరాసకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తడం మంచిది కాదు కనుక ప్రజల, కాంగ్రెస్‌ నేతల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్‌ ఈ జాతీయపార్టీ అనే సరికొత్త ప్రతిపాదన చేసి ఉండవచ్చు. దానికి ప్రజలు కనెక్ట్ అయ్యారో లేదో కానీ కాంగ్రెస్‌ నేతలు బాగానే కనెక్ట్ అయ్యారని అవారి మాటలతో స్పష్టం అవుతోంది. 


Related Post