ఎన్నికల తరువాత ఏమి జరుగుతుందో మీరే చూస్తారు: కేసీఆర్‌

March 17, 2019


img

ఆదివారం సాయంత్రం కరీంనగర్‌లో జరిగిన తెరాస ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్న తెలంగాణ సిఎం కేసీఆర్‌ తన ప్రసంగంలో అనేక అంశాలను ప్రస్తావిస్తూ విపక్షాలకు ధీటుగా సమాధానం చెప్పారు. 

“దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడేవరకు ఏవిధంగా ఉంది. ఈ ఐదేళ్ళలో  ఏవిధంగా మారిందో కళ్ళకు స్పష్టంగా కనబడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో నాలుగు అమృతజలాధారాలు నిత్యం పారుతూ 365 రోజులు వ్యవసాయానికి నీళ్ళు అందుబాటులో ఉంటాయి. త్వరలోనే దేవాదుల, మేడిగడ్డ, ఎల్లంపల్లి ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తాం. అవి పూర్తయితే రాష్ట్రంలో ప్రతీ ఎకరాకు నీరు అందుతుంది. ఒకప్పుడు రాష్ట్రంలో సాగునీరు కోసం ధర్నాలు, పాదయాత్రలు చేసుకొనే దుస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఎటు చూసినా సాగునీరు కాలువలతో తెలంగాణ కళకళలాడుతోంది. 

“ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం కావాలంటే అందరూ అవహేళన చేశారు. కానీ ఇదే గడ్డపై తెలంగాణ సాధిస్తానని శపధం చేసి సాధించి చూపాను. 5 ఏళ్ళ క్రితం కోటి ఎకరాలకు నీళ్ళు అందిస్తానని హామీ ఇచ్చాను. అదీ నెరవేర్చబోతున్నాను. ఒకప్పుడు తీవ్ర వివక్షకు గురై అన్ని రంగాలలో వెనుకబడిన మన తెలంగాణ ఇప్పుడు దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఇవన్నీ కేవలం 5 ఏళ్ళ వ్యవదిలోనే చేసి చూపించాము. ఇంకా చేయవలసింది చాలా ఉంది. అవి కూడా చేసి చూపిస్తాము.”

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్‌, బిజెపిల వలననే ఏడు దశాబ్ధాల తరువాత కూడా నేటికీ దేశం అన్ని రంగాలలో వెనుకబడిపోయుంది. కనుక కాంగ్రెస్‌, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా మరో రాజకీయశక్తి ఏర్పాటు చేసి జాతీయస్థాయి రాజకీయాలలో మార్పు తీసుకురావలసిన అవసరం చాలా ఉంది. అందుకే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తున్నాం. ఒకప్పుడు తెలంగాణ సాధిస్తానని చెప్పినప్పుడు చాలా మంది అవహేళన చేశారు. కానీ ఇద్దరు ఎంపీలతోనే పోరాటం ప్రారంభించి తెలంగాణ రాష్ట్రం సాధించుకొన్నాము. ఇప్పుడూ 16 ఎంపీ సీట్లు వస్తే ఏమి చేస్తావని చాలా మంది హేళన చేస్తున్నారు. భావస్వారూప్యత కలిగిన పార్టీలతో కలిపి మనకు 100-120 మంది ఎంపీలు ఉంటారు. 16 ఎంపీలతో ఏమి సాధిస్తామో లోక్‌సభ ఎన్నికల తరువాత చూపిస్తాను, ” అని కేసీఆర్‌ అన్నారు. 


Related Post