మీరు చెప్పుకొనే ఆదర్శం ఇదేనా? భట్టి ప్రశ్న

March 15, 2019


img

“తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచి...మన పధకాలు దేశానికే ఆదర్శం...ఈరోజు తెలంగాణలోజరుగుతున్నది రేపు దేశమంతా పాటిస్తుంది...” అంటూ తెరాస నేతలు గొప్పలు చెప్పుకోవడం అందరూ వింటూనే ఉన్నారు. అయితే అది నిజమే కనుక ఎవరూ వేలెత్తి చూపడం లేదు. కానీ ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను, ఎంపీలను ఫిరాయింపులకు ప్రోత్సహిస్తూ తెరాస చేస్తున్న అనైతిక రాజకీయాలను ఎవరూ హర్షించలేరు. “దేశానికే తెలంగాణ ఆదర్శం అని చెప్పుకొంటూ మరోపక్క రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఈవిధంగా ఖూనీ చేయడం సమంజసమేనా? ఇదేనా మీరు దేశానికే చేసే మార్గదర్శనం?” అని సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. 

ఆయన నిన్న గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “స్వయంగా ముఖ్యమంత్రే ఫిరాయింపులను ప్రోత్సహించి రాష్ట్రంలో ప్రతిపక్షాలే లేకుండా చేద్దామని కుట్రలు చేస్తుండటం చాలా బాధాకరం. ఇదేనా మీ ఆదర్శం? ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ అనైతికంగా వ్యవహరిస్తూ మళ్ళీ అదేదో ఘనకార్యం అన్నట్లు చెప్పుకోవడం సిగ్గుచేటు. రాజ్యాంగం పట్ల సిఎం కేసీఆర్‌కు ఏమాత్రం గౌరవం ఉన్నా ఫిరాయింపుల ఆలోచనలు మానుకోవాలి. కాంగ్రెస్ పార్టీని ధైర్యంగా ఎదుర్కొలేకనే ఫిరాయింపుల ద్వారా బలహీనపరచాలనుకోవడం అనైతికతకు పరాకాష్ట. తెరాస ప్రలోభాలకు, బెదిరింపులకు తలొగ్గి ఆ పార్టీలో చేరుతున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, నేతలు కూడా ఆలోచించుకోవాలి. అనేకమంది  కార్యకర్తలు రేయింబవళ్లు కష్టపడి పనిచేసి ఎన్నో త్యాగాలు చేస్తే మీరు ఆ పదవులు పొందగలిగారు. వారి త్యాగాలను,  మిమ్మల్ని ఎన్నుకొన్న ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడం సరికాదు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఏమాత్రం నీతి, నిజాయితీ ఉన్నా వారు తక్షణమే తమ పదవులకు రాజీనామాలు చేసి మళ్ళీ ఎన్నికలలో పోటీ చేసి గెలిచి చూపాలి,” అని అన్నారు. 


Related Post