నేడు కాంగ్రెస్‌, రేపు బిజెపి అభ్యర్ధుల ప్రకటన?

March 15, 2019


img

ఏప్రిల్ 11న జరుగబోయే లోక్‌సభ ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్‌, బిజెపి నేతలు డిల్లీ చేరుకొని తమ అధిష్టానంతో కూర్చొని అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రాత్రిలోగా కనీసం 10-12 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించవచ్చు. బిజెపి శనివారంనాడు 17 మంది అభ్యర్ధులను ఒకేసారి ప్రకటించబోతున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని 16 స్థానాలను తెరాస, మజ్లీస్ ఒకటి గెలుచుకొంటాయని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ చాలా నమ్మకంగా చెపుతున్న సంగతి తెలిసిందే. వరుస విజయాలతో ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతున్న తెరాసను జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బిజెపిలు ఎదుర్కోగలవా లేదా? ఎదుర్కొని విజయం సాధించగలవా లేదా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఒకసారి కాంగ్రెస్‌, బిజెపిల పరిస్థితులను గమనించినట్లయితే రెండూ రెండు రకాల సమస్యలతో బాధలు పడుతుండటం గమనించవచ్చు.   

సరిగ్గా లోక్‌సభ ఎన్నికలకు ముందే ఏకంగా ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తెరాసలో చేరిపోగా నిజామాబాద్‌ జిల్లాలో ఎల్లారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జాజుల సురేందర్ కూడా తెరాసలో చేరిపోవడానికి సిద్దం అవుతున్నారు. ఇంకా ఎంతమంది వెళ్లిపోతారో కూడా తెలియదు. ఈ ఫిరాయింపుల కారణంగా కాంగ్రెస్ పార్టీకి ఆయా నియోజకవర్గాలలో నేతలు, క్యాడర్ ఖాళీ అయిపోతుండటంతో లోక్‌సభ ఎన్నికలలో ఎదురీదవలసిరావచ్చు.   

ఇక బిజెపి విషయానికి వస్తే గ్రేటర్ ఎన్నికల నుంచి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు ఏ ఒక్క ఎన్నికలో గెలువలేకపోయింది. ఆ కారణంగా బిజెపి శ్రేణులలో కూడా నిరుత్సాహం ఆవరించి ఉంది. కేంద్రంలో బిజెపికి చాలా బలమైన నాయకత్వం ఉన్నప్పటికీ రాష్ట్రంలో బిజెపిని ఉరకలెత్తించగల నాయకుడు కనబడటం లేదు. నాయకత్వ లోపం, వరుస ఓటములతో రాష్ట్రంలో బిజెపి పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. కనుక ఇతర రాష్ట్రాలలో బిజెపి సీట్లు సాధించేశక్తి ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం కష్టమేనని చెప్పవచ్చు. 

కనుక కాంగ్రెస్‌, బిజెపిల అభ్యర్ధులు తమ పార్టీల బలంతో కాక సొంతబలంతోనే బరిలో దిగి పోరాడవలసి ఉంటుంది. కనుక వారిలో అంతా శక్తిసామర్ధ్యలు కలిగినవారు ఎందరున్నారనేదే ప్రశ్న.


Related Post