సబితా అండ్ సన్స్ కేసీఆర్‌తో భేటీ

March 14, 2019


img

సీనియర్ కాంగ్రెస్‌ నేత సబితా ఇంద్రారెడ్డి తన ముగ్గురు కుమారులతో కలిసి బుదవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. త్వరలో జరుగబోయే చేవెళ్ళ బహిరంగసభలో తెరాసలో చేరుతామని కేసీఆర్‌కు వారు తెలియజేశారు. ఈ సందర్భంగా చేవెళ్ళ లోక్‌సభ స్థానాన్ని సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డికి కేటాయించడంపై వారు చర్చించారు. సిఎం కేసీఆర్‌ నిర్ధిష్టమైన హామీ ఇవ్వనప్పటికీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే చేవెళ్ళ టికెట్ కార్తీక్ రెడ్డికి కేటాయించాలంటే అక్కడి నుంచి పోటీ చేయాలనుకొన్న రంజిత్ రెడ్డిని వేరే నియోజకవర్గానికి మార్చాల్సి ఉంటుంది లేదా పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఆ రెండూ కూడా చాలా ఇబ్బందికరమైనవే కనుక దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకొంటానని సిఎం కేసీఆర్‌ చెప్పినట్లు తెలుస్తోంది. 

సిఎం కేసీఆర్‌తో భేటీ ముగిసిన తరువాత కార్తీక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “చేవెళ్ళ బహిరంగసభలో మేము తెరాసలో చేరబోతున్నాము. ముఖ్యమంత్రిని అడగవలసినవన్నీ అడిగాము. ఆయన కూడా చెప్పవలసినవన్నీ చెప్పారు,” అని క్లుప్తంగా ముగించారు.

ఇప్పటి వరకు చేవెళ్ళలో కాంగ్రెస్ పార్టీ తరపున సబితా ఇంద్రారెడ్డి ఆమె కుమారులు తెరాసతో పోరాడుతుండేవారు. కానీ వారే ఇప్పుడు తెరాసలో చేరుతున్నారు. కనుక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వారితోనే పోరాడవలసి ఉంటుంది. ఒకవేళ చేవెళ్ళ లోక్‌సభ టికెట్ కార్తీక్ రెడ్డికి కేటాయించినట్లయితే, అప్పుడు తెరాస నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి తెరాసలోకి వెళుతున్న కార్తీక్ రెడ్డికి మద్య పోటీ ఉంటుంది.


Related Post