సబిత మళ్ళీ యూ టర్న్?

March 12, 2019


img

మహేశ్వరం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మళ్ళీ ‘యూ టర్న్’ తీసుకొన్నారు. సీనియర్ కాంగ్రెస్‌ నేతలు జానారెడ్డి, రేవంత్‌ రెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు ఇవాళ్ళ ఉదయం ఆమె నివాసానికి వెళ్ళి ఆమెను కాంగ్రెస్ పార్టీలో కొనసాగవలసిందిగా నచ్చ చెప్పడంతో ఆమె కాస్త మెత్తపడ్డారు. అనంతరం ఆమె కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారని కాంగ్రెస్‌ నేతలు ప్రకటించారు. కానీ వారు వెళ్ళిన తరువాత మళ్ళీ సబితా ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి తమ ముఖ్య అనుచరులతో సమావేశమయ్యి ఈ విషయంపై చర్చించి కాంగ్రెస్ పార్టీని వీడాలని నిర్ణయించుకొన్నారు. 

రెండు రోజుల క్రితం మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ నివాసంలో ఆమె తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో రహస్యంగా సమావేశమయ్యారు. ఆ సందర్భంగా తన కుమారుడు కార్తీక్ రెడ్డికి చేవెళ్ళ లోక్‌సభ టికెట్, తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఆమె షరతు విధించినట్లు సమాచారం. ఇప్పుడు ఆమె తెరాసలో చేరేందుకు సిద్దపడుతున్నారంటే ఆమెకు మంత్రి పదవి, కార్తీక్ రెడ్డికి చేవెళ్ళ లోక్‌సభ టికెట్ హామీ లభించినట్లే భావించాల్సి ఉంటుంది. ఆమె తెరాసలో చేరినట్లయితే ఆమెకు పార్టీ ప్రయోజనాల కంటే తమ కుటుంబ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తున్నట్లు స్పష్టం చేసినట్లే. చేవెళ్ళ నుంచి సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయనున్నారు. ఒకవేళ కార్తీక్ రెడ్డికి తెరాస టికెట్ లభిస్తే ఆయనతో పోటీ పడవలసి ఉంటుంది. ఒకవేళ కొండా చేతిలో కార్తీక్ రెడ్డి ఓడిపోయినట్లయితే సబితా ఇంద్రారెడ్డి తొందరపాటు నిర్ణయం తీసుకొన్నట్లే అవుతుంది.


Related Post