తెరాస వాదనలకు కాంగ్రెస్, బిజెపీ కౌంటర్

March 09, 2019


img

లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాల సందర్భంగా తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, “కర్ర ఉన్నవాడిదే బర్రె...కేంద్రాన్ని యాచించి తెచ్చుకోవడం కాదు కొట్లాడి సాధించుకోవాలి...16 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచుతాము... కాంగ్రెస్‌, బిజెపిలను గెలిపిస్తే డిల్లీకి గులాములవుతాము..తెరాసను గెలిపిస్తే రాష్ట్రానికి గులాబీలవుతాము,” అంటూ చెపుతున్న మాటలపై కాంగ్రెస్‌, బిజెపిలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

ఫెడరల్‌ ఫ్రంట్‌ కేంద్రంలో అధికారంలోకి రాలేదని కేటీఆర్‌ స్వయంగా చెపుతున్నప్పుడు, మరి కాంగ్రెస్‌, బిజెపిలలో ఏ కూటమికి కేసీఆర్‌ మద్దతు ఇస్తారని బిజెపి నేతలు ప్రశ్నిస్తుంటే, మోడీకి మద్దతు కూడగట్టేందుకే ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రతిపాదనతో కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని కాంగ్రెస్‌ నేతల వాదిస్తున్నారు. 

‘కర్ర ఉన్నవాడిదే బర్రె...కేంద్రాన్ని యాచించి తెచ్చుకోవడం కాదు...కొట్లాడి సాధించుకోవాలనే’ తెరాస వాదన ‘బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు’ చేయడమేనని కాంగ్రెస్‌, బిజెపిలు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. తెరాస స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రంలో అస్థిరమైన, బలహీనమైన  ప్రభుత్వం ఏర్పడాలని కోరుకోవడం, 16 ఎంపీ సీట్లు అడ్డుపెట్టుకొని కేంద్రాన్ని బ్లాక్ మెయిల్ చేయాలనుకోవడం చాలా దారుణమని కాంగ్రెస్‌, బిజెపి నేతలు వాదిస్తున్నారు. 

‘16 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచుతామని’ తెరాస నేతలు చెపుతుండటాన్ని కూడా అవి తప్పు పడుతున్నాయి. ఈ వాదనను ఆ రెండు పార్టీలు వేరే కోణంలో నుంచి చూపుతున్నాయి. ఈ వాదనతో 16 సీట్లు గెలుచుకోవడానికే తెరాస ఉద్దేశ్యపూర్వకంగా రాష్ట్ర ప్రజలను తప్పుదారిలో నడిపించడానికి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌, బిజెపిలు వాదిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో వివిద పార్టీల ఎంపీలు కలిసి పార్లమెంటులోపలా బయటా చేసిన పోరాటాలను కాంగ్రెస్‌, బిజెపిలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాయి. ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు లభించిన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణకు చెందిన ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభలో కేంద్రంపై నిరంతరం ఒత్తిడి చేస్తూనే ఉంటారనే సంగతి ప్రజలు గ్రహించాలని కాంగ్రెస్‌, బిజెపిలు కోరుతున్నాయి. కేవలం తెరాసకు 16 ఎంపీ సీట్లు ఇస్తేనే రాష్ట్రానికి అన్ని లభిస్తాయి వేరే పార్టీల ఎంపీలను గెలిపిస్తే ఏమీ రావన్నట్లు మాట్లాడుతూ తెరాస నేతలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని కాంగ్రెస్‌, బిజెపిలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్‌, బిజెపి నేతల ఈ వాదనలకు తెరాస ఏమి సమాధానం చెపుతుందో?


Related Post