హమ్మయ్యా! తమిళనాడులో దోస్త్ దొరికింది కానీ...

February 20, 2019


img

కాంగ్రెస్‌, బిజెపిలు ఎంత గొప్ప జాతీయ పార్టీలైనప్పటికీ తమిళనాడులో వాటిని పట్టించుకొనేవారే ఉండరు. కనుక తమిళనాడులో పాగా వేయాలంటే తప్పనిసరిగా ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో దోస్తీ తప్పనిసరి. దోస్తీ చేసినా ప్రజలు ఆదరిస్తారనే గ్యారెంటీ లేదు. ఎన్నికలొచ్చేసరికి తమిళప్రజలు కాంగ్రెస్‌, బిజెపిలను పక్కనపెట్టి మళ్ళీ ప్రాంతీయపార్టీలకే ఓట్లు వేస్తుంటారు. కానీ ఎప్పటికైనా తమిళనాడులో నిలద్రొక్కుకోవాలంటే ఏదో ఓ ప్రయత్నం చేస్తూనే ఉండాలి కనుక అధికార అన్నాడిఎంకె పార్టీతో బిజెపి పొత్తు పెట్టుకొంది. 

కేంద్రమంత్రి పీయూష్ గోయల్, బిజెపి నేతలు మంగళవారం ఉదయం నుంచి సిఎం పళనిస్వామి, డెప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంతో సుదీర్ఘంగా చర్చలు జరిపి ఎట్టకేలకు పొత్తులు కుదుర్చుకొన్నారు. రెండు పార్టీల మద్య పొత్తులు కుదిరినట్లు పళనిస్వామి ప్రకటించారు. తమిళనాడులో 39 లోక్‌సభ స్థానాలు ఉండగా వాటిలో 5 స్థానాలలో బిజెపి పోటీ చేస్తుందని ప్రకటించారు. అసెంబ్లీ ఉపఎన్నికలలో అన్నాడిఎంకె పార్టీకి బిజెపి సహకరిస్తుందని, 5 లోక్‌సభ స్థానాలు గెలుచుకోవడానికి అన్నాడిఎంకె పార్టీ బిజెపికి సహకరిస్తుందని పీయూష్ గోయల్ తెలిపారు. పుదుచ్చేరిలో కూడా రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయని తెలిపారు. 

తమిళనాట రాజకీయ లిజండ్స్ అని చెప్పుకోదగ్గ జయలలిత, కరుణానిధి జీవించి ఉన్నంతవరకు అన్నాడిఎంకె, డిఎంకె పార్టీలదే హవా. కానీ వారిరువురూ మరణించిన తరువాత ఆ రెండు పార్టీలలో అంతటి ప్రజాధారణ, నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకులు లేకపోవడంతో రాష్ట్రంలో రాజకీయ శూన్యత కనిపిస్తోంది. ఇదే అదునుగా కాంగ్రెస్‌, బిజెపిలు నిలద్రొక్కుకొందామని గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. 

కేంద్రంలో అధికారంలో ఉండటం బిజెపికి బాగా కలిసి వచ్చింది. అధికార అన్నాడిఎంకె పార్టీని మెల్లగా తన చెప్పుచేతలలోకి తెచ్చుకోగలిగింది కానీ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి గెలువగలమనే నమ్మకం లేనందునే ఆ పార్టీతో పొత్తులు పెట్టుకొంది. కానీ అన్నాడిఎంకె పార్టీతో పొత్తు పెట్టుకొన్నప్పటికీ తమిళప్రజలు బిజెపిని ‘హిందీ పార్టీ’గానే చూస్తారు కనుక దానికి ఓట్లేస్తారనే గ్యారెంటీ ఏమీ లేదు. అత్యంత ప్రజాధారణ, గుర్తింపు ఉన్న కమల్ హాసన్ ఈసారి సొంతపార్టీతో పోటీ చేస్తున్నారు. కనుక వెన్నెముకలేని ప్రభుత్వంగా మిగిలిన అన్నాడిఎంకె, ఉత్తరాదికి చెందిన బిజెపిల కంటే తమకు సుపరిచితుడైన కమల్ హాసన్ లేదా డిఎంకెలలో ఏదో ఒక పార్టీ వైపు తమిళప్రజలు మొగ్గు చూపవచ్చు.


Related Post