జగన్‌తో నాగార్జునకు ఏమి పనో?

February 19, 2019


img

ప్రముఖ తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జున మంగళవారం ఉదయం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో లోటస్ పాండ్ నివాసంలో సమావేశమయ్యారు. వారిరువురూ సుమారు అర్ధగంటసేపు ఏకాంతంగా మాట్లాడుకొన్నారు. అనంతరం నాగార్జున మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “జగన్మోహన్ రెడ్డి మాకుటుంబ స్నేహితుడు. ఆయన ఏపీలో ప్రజా సంకల్పయాత్ర (పాదయాత్ర)ను దిగ్విజయంగా పూర్తి చేసినందుకు అభినందించడాని వచ్చాను. అంతే తప్ప వేరే ఏ ఉద్దేశ్యం లేదు. నాకు రాజకీయాలపై ఆసక్తిలేదు. ఎవరికీ టికెట్ ఇప్పించడానికి రాలేదు. కేవలం మర్యాదపూర్వకంగానే కలిశాను,” అని చెప్పారు. 

నాగార్జున కుటుంబానికో ప్రత్యేకత ఉంది. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా వారితో సఖ్యతగా వ్యవహరిస్తుంటారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో నాగార్జునతో సహా సినీపరిశ్రమలో కొందరు పెద్దలు ఇబ్బందికి గురయ్యారు. అప్పుడు నాగార్జున చొరవ తీసుకొని సిఎం కేసీఆర్‌, కేటీఆర్‌లను కలుసుకొని తన సమస్యలను పరిష్కరించుకొన్నారు. అప్పటి నుంచి తెరాస సర్కారుతో సత్సంబందాలు కొనసాగుతున్నాయి. అడపాదడపా రాజకీయనాయకులను కలుస్తున్నప్పటికీ నాగార్జున రాజకీయాలకు ఎప్పుడూ ఆమడ దూరంలోనే ఉంటారు. కనుక బహుశః ఎవరైనా సినీనిర్మాత కోరిక మేరకు వైసీపీ టికెట్ కోసమే జగన్‌ను కలిసి ఉండవచ్చు. కానీ కాదని అంటున్నారు. కనుక ఒకవేళ రానున్న రోజులలో జగన్ ఏపీ సిఎం అయితే అవసరమైనప్పుడు ఆయన సహాయసహకారాలు పొందవచ్చనే ఉద్దేశ్యంతో ఈ వంకతో కలిసి ఉండవచ్చు. 

జగన్‌ను కలిసినంత మాత్రన్న నాగార్జున ఏపీ సిఎం చంద్రబాబునాయుడును వ్యతిరేకిస్తున్నారని అనుకోనవసరంలేదు.  అవకాశం లభిస్తే చంద్రబాబును కూడా తప్పక కలుస్తారు. ఆయనతో కూడా సత్సబంధాలు కొనసాగిస్తారు. కనుక నాగార్జున చూసి పబ్లిక్ రిలేషన్స్ మెయింటెయిన్ చేయడం ఎలాగో నేర్చుకోవలసిందే. 


Related Post