కేంద్రానికి అన్ని పార్టీలు పూర్తి మద్దతు

February 15, 2019


img

పుల్వామా దాడి ఘటనపై కేంద్రప్రభుత్వం ఈరోజు డిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. కేంద్రహోంమంత్రి రాజ్‌నాధ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఆ సమావేశంలో హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబ, కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్, గులామ్ నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, జ్యోతిరాదిత్య సింధియా, వేణుగోపాల్ (కాంగ్రెస్‌), జితేందర్ రెడ్డి (తెరాస), రామ్మోహన్ నాయుడు (టిడిపి), ఫరూక్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), రామ్ విలాస్ పాశ్వాన్( ఎల్.జె.పి.), సంజయ్ రవుత్ (శివసేన), సతీష్ చంద్ర మిశ్రా (బిఎస్పి), డి.రాజా (సిపిఐ), సందీప్ బందోపాధ్యాయ, డెరెక్ ఓ బ్రేన్( తృణమూల్ కాంగ్రెస్) సిపిఎం తదితర పార్టీల నేతలు పాల్గొన్నారు. 

పుల్వామా దాడికి సంబందించిన పూర్తివివరాలను కేంద్రహోంమంత్రి రాజ్‌నాధ్ సింగ్ సమావేశంలో పాల్గొన్న పార్టీల ప్రతినిధులకు వివరించారు. అనంతరం అన్ని పార్టీల ప్రతినిధులుఈ విషయంలో కేంద్రప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలిపాయి. గత నాలుగు దశాబ్ధాలుగా ప్రభుత్వానికి ప్రేరేపిత ఉగ్రవాదానికి ఎందరో బలైపోయారని కనుక దానిని కట్టడి చేయడానికి ఎటువంటి చర్యలు చేపట్టినా కేంద్రప్రభుత్వానికి సంపూర్ణమద్దతు ఇస్తామని అఖిలపక్ష నేతలు రాజ్‌నాధ్ సింగ్ కు హామీ ఇచ్చారు. అయితే ఎటువంటి చర్యలు చేపట్టాలనేదానిపై మరొకసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని వారు సూచించారు. 

పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకొంటామని ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా చెప్పారు. ఆయనకు అన్ని పార్టీలు మద్దతు పలికాయి. కనుక భారత ఆర్మీ మళ్ళీ మరోసారి ఎల్.ఓ.సి. దాటి పాక్ భూభాగంలో ప్రవేశించి సర్జికల్ స్ట్రయిక్స్ చేయవచ్చు లేదా మానవ రహిత ద్రోన్లను వినియోగించి సరిహద్దుకు అవతల బస చేసున్న ఉగ్రమూకలను గుర్తించి యుద్ధవిమానాలతో వారిపై బాంబుల వర్షం కురిపించవచ్చు. లేదా ఇదే అదునుగా పాక్ ఆక్రమిత కాశ్మీరును మళ్ళీ స్వాధీనంలోకి తెచ్చుకొనే ప్రయత్నాలు చేయవచ్చు. 

అయితే భారత్ ఆర్మీ అటువంటి ప్రయత్నాలు చేస్తుందని స్పష్టం అవుతోంది కనుక ఈసారి భారత్ ఆర్మీ లేదా వాయుసేనను ఎదుర్కోవడానికి పాక్ ఆర్మీ కూడా సిద్దంగానే ఉంటుంది. అదే కనుక జరిగినట్లయితే అది భారత్-పాకిస్తాన్ దేశాల మద్య ప్రత్యక్షయుద్దానికి దారి తీయవచ్చు. కనుక ఈసారి భారత్ మరింత ఆలోచించి ముందడుగు వేయవలసి ఉంటుంది.


Related Post