రైతుబంధు పధకం తాత్కాలికమేనా?

February 13, 2019


img

తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు పధకం వలన ప్రభుత్వానికి, దానిని రూపకల్పన చేసిన సిఎం కేసీఆర్‌కు మంచిపేరు వచ్చింది. కేంద్రప్రభుత్వం కూడా ఆ పధకాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రధాని కిసాన్ సమ్మన్ అనే పధకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో రైతులు తమ కాళ్ళపై తాము నిలద్రొక్కుకొనేవరకు ఈ పధకాన్ని కొనసాగిస్తామని సిఎం కేసీఆర్‌ స్వయంగా అనేకసార్లు చెప్పారు. కానీ రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్ధసారధి అందుకు భిన్నంగా ప్రకటన చేయడం ఆశ్చర్యకరమే. మంగళవారం హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “రైతుబంధు పధకం రాజకీయపరమైన నిర్ణయం. కనుక ఇది శాశ్విత పధకం కాదు. రైతులకు పూర్తిస్థాయిలో మౌలికవసతులు కల్పించేవరకు మాత్రమే అది కొనసాగుతుంది,” అని చెప్పారు. అయితే ప్రభుత్వం దీనిని ఎంతకాలం కొనసాగించబోతోంది? అనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు. 

రైతుబంధు పధకం వలన ప్రభుత్వానికి మంచిపేరు వస్తున్నప్పటికీ దాని వలన ప్రభుత్వంపై పెనుభారం పడుతోంది. నిరుపేద కౌలురైతులకు దీనిని వర్తింపజేయకుండా, వందల ఎకరాలున్న బడా భూస్వాములకు, రాజకీయనాయకులకు, పారిశ్రామికవేత్తలకు కూడా దీనిని వర్తింపజేయడంపై విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్ధసారధి ఈవిధంగా చెప్పడంతో మరిన్ని విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. కనుక ఈ పధకం కొనసాగింపుపై ప్రభుత్వం స్పష్టత ఇస్తే మంచిది. బడాభూస్వాములకు ఈ పధకాన్ని వర్తింపజేయడంవలననే ప్రభుత్వంపై అధనపు భారం పడుతోందని వేరే చెప్పక్కరలేదు. కనుక వారినందరినీ ఈ పధకం నుంచి తప్పించి రైతుబంధును యధాతధంగా మరికొన్నేళ్ళు కొనసాగిస్తే బాగుంటుంది.


Related Post