చంద్రబాబు ఓడిపోవాలని కెసిఆర్ ఎందుకు కోరుకొంటున్నారు?

February 08, 2019


img

తెరాస ఎంపీ, తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ఫెడరల్‌ ఫ్రంట్‌, ఏపీ రాజకీయాల గురించి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ్ళ ఆయన మీడియాతో మాట్లాడుతూ, “తెరాస ఎప్పుడూ కాంగ్రెస్‌, బిజెపిలకు సమానదూరంలోనే ఉంటోంది. కనుక సిఎం కేసీఆర్‌ ఏర్పాటు చేస్తున్న ఫెడరల్‌ ఫ్రంట్‌ కూడా ఆ రెండు పార్టీలకు సమానదూరంలోనే ఉంటుంది. త్వరలో జరుగబోయే లోక్‌సభ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలువబోతోందని సర్వేలు సూచిస్తున్నాయి. కనుక తెలుగుదేశం పార్టీకి ఓటమి తప్పదు. గత నాలుగున్నరేళ్ళలో చంద్రబాబునాయుడు మాయమాటలు చెప్పడం తప్ప రాష్ట్రాభివృద్ధికి చేసిందేమీ లేదు. మోసపూరిత మాటలతో ప్రజలను మభ్యపెట్టడంలో చంద్రబాబునాయుడే నెంబర్: 1. కనుక అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబు దుష్టపాలనకు ముగింపు పలకాలని ఏపీ ప్రజలు ఎదురుచూస్తున్నారు,” అని అన్నారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబునాయుడు జోక్యం చేసుకున్నారు కనుకనే ఏపీ ఎన్నికలలో తాము జోక్యం చేసుకొంటామని సిఎం కేసీఆర్‌ చెప్పారు. అయితే కేవలం అదే కారణం చేత ఏపీలో టిడిపి ఓడిపోవాలని తెరాస నేతలు కోరుకొంటున్నారా? అంటే కాదనే చెప్పాలి. చంద్రబాబునాయుడు పట్ల కేసీఆర్‌ కున్న ద్వేషం, ఏహ్యత గురించి అందరికీ తెలిసిందే. అందుకే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో పశ్చిమబెంగాల్, కర్ణాటక, ఒడిశా, ఎక్కడో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నేతల మద్దతు కోసం ప్రయత్నించిన సిఎం కేసీఆర్‌ పొరుగునే అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడును కాదని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మద్దతు కోరారు. అదేవిధంగా చంద్రబాబు కాంగ్రెస్‌ నేతృత్వంలో కూటమిని కేంద్రంలో అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు కనుక ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి అధికారంలోకి వస్తే కేసీఆర్‌ ప్రతిపాదిస్తున్న ఫెడరల్‌ ఫ్రంట్‌కు టిడిపి మద్దతు లభించదు. కనుక ఫెడరల్‌ ఫ్రంట్‌కు మద్దతు ఇవ్వడానికి సిద్దంగా ఉన్న వైకాపా గెలవాలని, టిడిపి ఓడిపోవాలని తెరాస నేతలు కోరుకోవడం సహజమే. అయితే వారి కోరికలు, ప్రయత్నాలు, జోస్యం ఫలిస్తాయా లేదా అనేది ఎన్నికల తరువాతే తెలుస్తుంది. 


Related Post