మమతక్క ర్యాలీకి కేసీఆర్‌, రాహుల్, మాయావతి డుమ్మా!

January 19, 2019


img

సిఎం కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రతిపాదన చేసినప్పుడు మొట్టమొదట కలిసింది పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన తరువాత మళ్ళీ అదేపనిమీద మరోసారి కోల్‌కతా వెళ్ళి ఆమెను కలిసి వచ్చారు. కానీ ఆమె అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఈరోజు కోల్‌కతాలో నిర్వహిస్తున్న ‘యునైటెడ్ ఇండియా బ్రిగేడ్’ ర్యాలీకి కేసీఆర్‌ డుమ్మా కొట్టారు. ఏపీ సిఎం చంద్రబాబుతో వేదిక పంచుకోవడం ఇష్టం లేకనే కేసీఆర్‌ ఆ ర్యాలీకి హాజరుకావడం లేదని టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. అయితే అదొక్కటే కారణం కాదు...ఈ ర్యాలీలో కాంగ్రెస్‌ నేతలు కూడా హాజరవుతుండటం కూడా మరో కారణం.

అయితే ఆయన ప్రధాని నరేంద్రమోడీ కోసమే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తున్నారు కనుకనే ఈ బిజెపి వ్యతిరేక ర్యాలీకి హాజరుకాలేదని చంద్రబాబునాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు.   

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బిఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఈర్యాలీకి హాజరుకాలేదు కానీ తమ పార్టీ సీనియర్ నేతలను పంపించారు. ఎందుకంటే మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ, మాయావతి ముగ్గురూ కూడా ప్రధానమంత్రి పదవిని ఆశిస్తున్నారు. కనుక ఈ ర్యాలీకి హాజరైతే మమతా బెనర్జీ నాయకత్వాన్ని అంగీకరించినట్లవుతుందనే ఉద్దేశ్యంతో వారిరువురూ హాజరుకాలేదు. కానీ లోక్‌సభ ఎన్నికలలో కలిసి పనిచేయాలనే ఉద్దేశ్యం ఉంది కనుక ఆమెకు సంఘీభావం తెలుపుతూ తమ ప్రతినిధులను పంపించారు. ఈ ర్యాలీతో దేశరాజకీయ సమీకరణాలలో ఏవైనా పెనుమార్పులు వస్తాయో లేదో చూడాలి.


Related Post