మంత్రివర్గం ఏర్పాటు ఇంకా ఎప్పుడో?

January 18, 2019


img

శాసనసభ సభ్యుల ప్రమాణస్వీకారాలు, స్పీకర్ ఎంపిక పూర్తయి శాసనసభ సమావేశాలు మొదలయ్యాయి. గవర్నర్ నరసింహన్ రేపు ఉభయసభల సభ్యులనుద్దేశ్యించి ప్రసంగిస్తారు. ఆ మరుసటిరోజున అంటే ఆదివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ఆమోదించడంతో శాసనసభ సమావేశాలు ముగుస్తాయి. 

శాసనసభ్యుల ప్రమాణస్వీకారాలు చేసిన తరువాత వారిలో కొందరితో కేసీఆర్‌ మంత్రివర్గం ఏర్పాటు చేస్తారని అందరూ భావించారు. కానీ సిఎం కేసీఆర్‌ ఇంతవరకు మంత్రివర్గం ఏర్పాటు గురించి ఎటువంటి సంకేతాలు ఇవ్వకపోవడం విశేషం. తెరాస నేతలెవరూ కూడా మంత్రివర్గం ఏర్పాటు గురించి మాట్లాడకపోవడం ఇంకా విచిత్రం. కనుక మంత్రివర్గం ఇంకా ఎప్పుడు ఏర్పాటు చేస్తారో ఎవరికీ తెలియదు. 

మంత్రివర్గం ఏర్పాటు చేయడంలో ఇంత ఆలస్యం చేయడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. 1. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనేతలను లేదా సీనియర్ ఎమ్మెల్యేలకు మంత్రిపదవి ఆఫర్ చేసి వారిని తెరాసలోకి రప్పించడం కోసం కావచ్చు. 2. లోక్‌సభ ఎన్నికలలో కూడా తెరాస ఘనవిజయం సాధించి, ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రయత్నాలు ఫలిస్తే, కేసీఆర్‌ తన పదవికి రాజీనామా చేసి, కేటీఆర్‌ను ఆ కుర్చీలో కూర్చోబెట్టి తాను జాతీయ రాజకీయాలకు షిఫ్ట్ అవ్వాలనే ఉద్దేశ్యంతో కావచ్చు. 

ఒకవేళ మొదటి కారణమే నిజమనుకుంటే అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు…వెన్వెంటనే మంత్రివర్గం ఏర్పాటు జరుగవచ్చు. జరుగకపోతే రెండవ కారణం కావచ్చు. అంటే లోక్‌సభ ఎన్నికల తరువాత అంటే ఏప్రిల్ నెలలో మంత్రివర్గం ఏర్పాటు చేయవచ్చు. 


Related Post