బాబుకు ఏపీ ప్రజలే రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తారు: తలసాని

January 14, 2019


img

సాధారణంగా శుభకార్యాలలో మాత్రమే వినిపించే ‘రిటర్న్ గిఫ్ట్’ ఇప్పుడు రాజకీయాలలో కూడా నిత్యం వినిపిస్తుండటం విశేషం. ఏపీ సిఎం చంద్రబాబుకు తెలంగాణ సిఎం కేసీఆర్‌ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించినప్పటి నుంచి రిటర్న్ గిఫ్ట్ వేరే అర్ధంతో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 

తెరాస ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం విజయవాడ పర్యటన సందర్భంగా ఇబ్రహీంపట్నం మండలంలోని మూడపాడులో స్థానిక యాదవ సంఘాలు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించాయి. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ, “తెలంగాణలో యాదవుల సంక్షేమం కోసం సిఎం కేసీఆర్‌ రూ.500 కోట్లు కేటాయించి యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కానీ ఏపీ సిఎం చంద్రబాబు యాదవులను పట్టించుకోనేలేదు. ఈ నాలుగున్నరేళ్ళలో ఆయన చేసిందేమీ లేకపోయినా ప్రజాధనంతో గొప్పగా ప్రచారం చేసుకొంటున్నారు. ఆయన ప్రచారానికి పరిమితమైన నాయకుడు. అయితే రాష్ట్రాభివృద్ధి చేయకుండా ఎల్లకాలం ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టలేరనే సంగతి ఆయన గ్రహించలేదు. కనుక రాబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో ఏపీ ప్రజలే ఆయనకు ‘రిటర్న్ గిఫ్ట్’ ఇవ్వబోతున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా సాధించలేకపోయిన చంద్రబాబు రోజుకోమాట మాట్లాడుతూ, ఇప్పుడు మా ప్రభుత్వం దానికి అడ్డుపడుతోందని వాదిస్తున్నారు. తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే చంద్రబాబు మమ్మల్ని నిందిస్తున్నారు. కేంద్రప్రభుత్వం ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తానంటే మా పార్టీ మద్దతు పలుకుతుంది,” అని అన్నారు.  

ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో ఏపీ సిఎం చంద్రబాబు ఎన్నిసార్లు మాట మార్చారో, తెలంగాణ సిఎం కేసీఆర్‌ కూడా అన్నిసార్లు మాట మార్చారని అందరికీ తెలుసు. మొదట ఈవిషయంలో ఏపీకి మద్దతు ఇస్తామన్నారు. ఆ తరువాత ఏ‌పీకి ప్రత్యేకహోదా ఇస్తే తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని కనుక ఏపీకిస్తే తెలంగాణకు కూడా ఇవ్వాలని మెలిక పెట్టారు. ఏ‌పీకి ప్రత్యేకహోదా ఇచ్చి తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించాలి? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఏ‌పీకి ప్రత్యేకహోదా ఇస్తామంటే మద్దతు ఇస్తామని తలసాని చెపుతున్నారు! అంటే అర్ధం ఏమిటి? 


Related Post