కూటమిలో చేరికపై నవీన్ పట్నాయక్ స్పందన

January 09, 2019


img

తెలంగాణ సిఎం కేసీఆర్‌ ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనతో కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఒడిశా ముఖ్యమంత్రులను కలిసిన సంగతి తెలిసిందే. కానీ వారిలో ఎవరూ కూడా ఇంతవరకు ఫెడరల్ ఫ్రంట్ లో చేరుతామని చెప్పలేదు. చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్లు మాట్లాడలేదు. యూపీలోని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ సింగ్ యాదవ్‌ ఒక్కరే కేసీఆర్‌ ప్రతిపాదన పట్ల ఆసక్తి చూపారు. రైతులకు మద్దతుగా నిన్న డిల్లీలో జరిగిన ఒక బహిరంగసభలో పాల్గొనడానికి వచ్చిన బిజెడి అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను విలేఖరులు “ఫెడరల్ ఫ్రంట్ లో చేరుతున్నారా లేదా?” అని ప్రశ్నించినప్పుడు, “దీనిపై నిర్ణయం తీసుకోవడానికి మాకు మరికొంత సమయం పడుతుంది,” అని క్లుప్తంగా సమాధానం చెప్పారు.  

ఒడిశాలోని బిజెడి చాలా కాలంగా బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు సమానదూరం పాటిస్తోంది. కనుక కేసీఆర్‌, చంద్రబాబునాయుడు ప్రతిపాదిస్తున్న రెండు కూటములలో బిజెడి దేనిలో చేరుతుందో తెలియదు. ప్రాంతీయ పార్టీగా ఉన్న బిజెడికి ఒడిశాలో మంచి పట్టుంది. ఒడిశాలోగల 21 లోక్‌సభ స్థానాలలో 20 బిజెడి చేతిలోనే ఉన్నాయి. మిగిలిన ఒక్క సీటు బిజెపి గెలుచుకొంది. త్వరలో జరుగబోయే పార్లమెంటు ఎన్నికలలో కూడా బిజెడి మళ్ళీ 18-20 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. కనుక కేసీఆర్‌, చంద్రబాబులలో ఎవరివైపు నవీన్ పట్నాయక్ మొగ్గు చూపుతారో వారి చేతిలో మరో 18-20 లోక్‌సభ సీట్లున్నట్లే. 


Related Post