లోక్‌సభలో ఈబీసీ బిల్లు ప్రవేశపెట్టిన మోడీ సర్కార్

January 08, 2019


img

అగ్రవర్ణాల పేదలకు విద్యా, ఉద్యోగాలలో 10% రిజర్వేషన్లను కల్పిస్తూ రూపొందించిన బిల్లును కేంద్రమంత్రి థావర్‌ చంద్‌ గహ్లోత్‌ ఈరోజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొంది చట్టరూపం దాల్చితే దేశంలోని వివిద రాష్ట్రాలలోని బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ వర్గాలలో పేదలకు విద్యా, ఉద్యోగాలలో 10% రిజర్వేషన్లు లభిస్తాయి. దానిపై లోక్‌సభలో వాడివేడిగా చర్చలు సాగుతున్నాయి. రాజ్యాంగం ప్రకారం గరిష్టంగా 50%కు మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదు కనుక రాజ్యంగ సవరణ చేయవలసి ఉంటుంది. దీనికి ఆమోదముద్ర పడాలంటే ఉభయసభలలో కలిపి 2/3 వంతు మంది సభ్యులు మద్దతు అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీలతో సహా అన్నీ వెనుకబడిన వర్గాలకు కలిపి 49.5% రిజర్వేషన్లు లభిస్తున్నాయి. ఈ బిల్లు ఆమోదం పొందితే అప్పుడు దేశంలో రిజర్వేషన్లు 59.5%కు పెరుగుతాయి. దీనిపై అప్పుడే దేశంలో వివిద పార్టీలు, కులసంఘాలు, మంత్రులు భిన్నంగా స్పందిస్తున్నారు. 

ఎస్సీ,ఎస్టీ,బీసీ తదితర వెనుకబడిన వర్గాలకు 49.5% రిజర్వేషన్లు ఇవ్వగా మిగిలిన 51.5%లో మళ్ళీ వారితో సహా అన్నీ వర్గాలకు ఉంది. కనుక దానిలో 10% అగ్రవర్ణాలకు ఇవ్వడం వలన ఎవరికీ నష్టం లేదని బిజెపి వాదన. దేశంలో ఎస్సీ,ఎస్టీ,బీసీ తదితర వెనుకబడిన వర్గాల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలుచేయాలని కోరినప్పుడు స్పందించని కేంద్రప్రభుత్వం, సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని హటాత్తుగా ఈ బిల్లును తెరపైకి తెచ్చిందని కాంగ్రెస్, మిత్రపక్షాలు వాదిస్తున్నాయి. బిజెపి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయాలని చూస్తోందని టిడిపి వాదిస్తోంది. 

కనుక ఈ బిల్లు కూడా అది నిర్దేశించబడిన అసలు ప్రయోజనం కంటే కొసరు రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువగా ఉపయోగపడుతోందని చెప్పక తప్పదు.


Related Post