అది రాజకీయ ఉద్యోగ కల్పనే కదా?

January 08, 2019


img

ఏ ప్రభుత్వంలోనైనా మంత్రిపదవులకు విపరీతమైన పోటీ ఉంటుంది. కానీ రాజ్యాంగం ప్రకారం మొత్తం సభ్యుల సంఖ్యలో 15శాతం మందిని మాత్రమే నియమించుకోవచ్చు. ఆ కారణంగా పార్టీలో అందరికీ మంత్రిపదవులు ఇవ్వలేరు కనుక పదవులు లభించనివారిలో అసంతృప్తి ఏర్పడటం సహజమే. వారి అసంతృప్తిని పట్టించుకోకపోతే పార్టీకి, ప్రభుత్వానికే నష్టం కలుగవచ్చు కనుక వారికి ఏవో పదవులు ఇవ్వక తప్పదు. ఒకవేళ తగినన్ని పదవులు లేకపోతే వారి కోసం కొత్త పదవులు సృష్టించకతప్పదు. ఆవిధంగా ఏర్పడినవే పార్లమెంటరీ సెక్రెటరీ పదవులు. 

అయితే వాటిని న్యాయస్థానాలు ఆమోదించడం లేదు. కనుక సిఎం కేసీఆర్‌ అధికారులు, న్యాయనిపుణులతో చర్చించి ఆ పదవుల పేరులో చిన్న మార్పు చేశారు. ‘పార్లమెంటరీ సెక్రెటరీ’ పేరును ‘పార్లమెంటరీ పొలిటికల్ సెక్రెటరీ’ గా మార్చారు. ఈ పదవులకు సంబందించి కొన్ని విధివిధానాలు కూడా రూపొందించారు.ఈ మేరకు చట్ట సవరణలు చేయాలని నిర్ణయించారు. 

పార్లమెంటరీ పొలిటికల్ సెక్రెటరీలకు ఎటువంటి హోదా ఉండదు. వారు మంత్రిమండలి సమావేశాలలో పాల్గొనరు. వారు ప్రమాణస్వీకారం చేయరు కనుక నేరుగా బాధ్యతలు స్వీకరిస్తారు. శాసనసభలో మంత్రులకు కార్యదర్శుల మాదిరిగా వ్యవహరిస్తారు. సభలో మంత్రులు లేని సమయంలో పార్లమెంటరీ పొలిటికల్ సెక్రెటరీలు మంత్రుల తరపున సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెపుతారు. వీరికి లాభదాయకమైన పదవుల విధానం వర్తింపజేయకుండా ఉండే విధంగా నియమకాలు జరుగుతాయి. 

గత చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి పార్లమెంటరీ పొలిటికల్ సెక్రెటరీల నియామకాలతో ఎటువంటి న్యాయపరమైన సమస్యలు ఎదురవకుండా సిఎం కేసీఆర్‌ అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నారు. 15మంది మంత్రులకు 15 మంది పార్లమెంటరీ పొలిటికల్ సెక్రెటరీలను నియమించడం అంటే పార్టీలో 30 మందికి రాజకీయ ఉద్యోగాలు కల్పించినట్లే కదా! రాష్ట్రంలోని సుమారు 10 లక్షల మంది నిరుద్యోగులున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా చెపుతున్నారు. వారికి కూడా ఉద్యోగాలు కల్పించడానికి ప్రభుత్వం ఈవిధంగా చొరవ చూపితే అందరూ హర్షిస్తారు.


Related Post