ప్రక్షాళన జరుగుతూనే ఉంది: ప్రధాని మోడీ

January 03, 2019


img

2014 సార్వత్రిక ఎన్నికలలో బిజెపి ఘనవిజయం సాధించి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ‘గంగానదీ ప్రక్షాళన’ కార్యక్రమాన్ని కూడా భుజానికెత్తుకుంది. అయితే మళ్ళీ ఎన్నికలు దగ్గర పడుతున్నా మోడీ ప్రభుత్వం ఇంతవరకు ఆ పనిని పూర్తిచేయలేకపోయిందని ప్రతిపక్షాలు తరచూ విమర్శలు గుప్పిస్తుంటాయి.   

ప్రధాని మోడీ ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో “గంగానది ప్రక్షాళన చేయడంలో మీ ప్రభుత్వం విఫలమైందా?” అనే విలేఖరి ప్రశ్నకు సమాధానం చెబుతూ "గంగానదీ ప్రక్షాళన కోసం మా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అయితే వాటి గురించి ప్రజలకు, మీడియాకు తెలిసింది చాలా తక్కువ. ఎందుకంటే, గంగానదీ ప్రక్షాళన అంటే ఏదో ఒక చోట చేసే పని కాదు. 

గంగానది వివిధ రాష్ట్రాల గుండా వందల కిలోమీటర్లు ప్రవహిస్తుంటుంది. మళ్ళీ దానికి అనేక ఉపనదులున్నాయి. వందల కిలోమీటర్ల పొడవునా సాగే గంగానదిలో వివిధ రాష్ట్రాలలో...తీర ప్రాంతాలలో అనేక కాలుష్యం వెదజల్లే పరిశ్రమలున్నాయి. అలాగే తీర ప్రాంతాలలోని పట్టణాలలో మురికినీరు కూడా నదిలోకే చేరుతుంటుంది. కనుక గంగానదిలో చేరే ఆ మురికినీటిని, కాలుష్య కారకాలను, వ్యర్ధాలను చేరకుండా అడ్డుకోవడం కోసం అనేక చర్యలు చేపట్టాం. వాటి వలన గంగానదిలో ఇప్పుడు కాలుష్యం చాలా వరకు తగ్గింది నిపుణులు చెబుతున్నారు. 

అయితే ఏదో ఒకసారి మురికినీటిని, కాలుష్యకారకాలను నదిలో కలవకుండా ఆపినంత మాత్రాన ప్రయోజనం లేదు.  దానికి ఒక శాశ్వతమైన పరిష్కారం లభించాలి అప్పుడే గంగానది ఎప్పటికీ నిర్మలంగా ఉంటుంది. కనుక గంగానది తీరాన ఉండే పరిశ్రమలలో, పట్టణాలలో కాలుష్యాన్ని తగ్గించే వ్యవస్థలను ఏర్పాటు చేశాము. ఇంకా చేస్తూనే ఉన్నాము. శాశ్వితప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నఆ వ్యవస్థలు గంగానదిలో మళ్లీ ఎన్నడూ కాలుష్యం చేరకుండా నివారిస్తాయి. గత నాలుగేళ్లలో మా ప్రభుత్వం ఇటువంటి అనేక చర్యలు చేపట్టింది. ఇవన్నీ గంగానది ప్రక్షాళనలో భాగమే. కనుక గంగపుత్రుడిగా నేను నా శక్తిమేర గంగానది ప్రక్షాళన కోసం చిత్తశుద్ధితో పనిచేశాననే భావిస్తున్నాను, “ అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.


Related Post