కోదండరాం బాగానే విశ్లేషించారు కానీ...

January 03, 2019


img

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ జనసమితి 14 స్థానాలు పోటీచేసి ఘోరపరాజయం పాలైన సంగతి అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి మీడియాకు దూరంగా ఉన్న ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మొన్న తమ పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రజాకూటమి ఓటమికి కారణాలను చాలా చక్కగా విశ్లేషించారు.

ప్రజాకూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్, టిడిపి నాయకులతో సీట్ల సర్దుబాటు గురించి తాను పలుమార్లు సమావేశమైనప్పుడు, "నేను కేసీఆర్ తో చాలా ఏళ్లు కలిసి పనిచేశాను కనుక ఆయన వ్యూహాలు, ప్రచారశైలి గురించి నాకు మంచి అవగాహన ఉంది. కనుక తెరాసను ఎదుర్కోవాలంటే కనీసం నలభై యాభై రోజులు గట్టిగా ఎన్నికల ప్రచారం చేయవలసి ఉంటుందని పదేపదే చెప్పాను. కానీ ఎన్నికల ప్రచారానికి 15 రోజులు సరిపోతుందని కాంగ్రెస్, టీడీపీ నేతలు వాదించారు. ప్రజాకూటమిలో సీట్లు సర్దుబాటు చేసుకొని ఎన్నికల ప్రచారం దిగేసరికే తెరాస తెలంగాణ అంతటా జోరుగా ప్రచారం సాగించి ప్రజలను తనవైపు తిప్పుకోగలిగింది. మేము చాలా ఆలస్యంగా కొద్ది రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారం చేయడం వలన ప్రజలలోకి వెళ్ళలేకపోయాము. ఇదీ మా ఓటమికి ఒక కారణంగా భావిస్తున్నానని" కోదండరాం అన్నారు. 

కాంగ్రెస్ పార్టీ నేతల గురించి ఆయన ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఈ ఎన్నికలలో తాము తప్పకుండా గెలుస్తామని కాంగ్రెస్ నేతలు అతివిశ్వాసం ప్రదర్శిస్తూ కేసిఆర్ ను, ఆయన వ్యూహాలను తక్కువగా అంచనా వేయడం మా ఓటమికి మరో కారరణమని కోదండరాం అన్నారు. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత కాంగ్రెస్ నేతలు తమ ఓటమికి కారణాలను నిజాయితీగా విశ్లేషించుకుని ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా ఈవీఎంలను తప్పు పట్టడం సరికాదని కోదండరాం అన్నారు. కనుక ఇకనైనా కాంగ్రెస్ నేతలు ఆత్మవిమర్శ చేసుకొని లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవడం మంచిదని కోదండరాం అన్నారు. తమ పార్టీ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకునేందుకు సిగ్గు  పడబోమని కోదండరాం అన్నారు. పంచాయతీ ఎన్నికలలో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కోదండరాం అన్నారు.

ప్రజా కూటమి ఓటమికి గల కారణాలను కోదండరాం చాలా చక్కగా విశ్లేషించారు అయితే ఆయన సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వలననే తెలంగాణ జనసమితి ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిందని వేరే చెప్పనవసరం లేదు. అంటే టిజేఎస్‌ ఓటమిని కోదండరాం వైఫల్యంగానే చెప్పక తప్పదు. చేతులు కాలిన తరువాత ఆయన ఇప్పుడు ఆకులు పట్టుకుని ఏమి ప్రయోజనం? కాంగ్రెస్ నేతలను నిందించి ఏమి ప్రయోజనం? కనుక ఆయన కూడా తన పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సరైన నిర్ణయాలు తీసుకుంటే మంచిది.


Related Post