ప్రధాని అభ్యర్ధిగా మమతా బెనర్జీ!

January 03, 2019


img

వచ్చే సార్వత్రిక ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారబోతున్నాయి. పార్లమెంటు ఎన్నికలలో ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో బిజెపి తిరుగులేని మెజార్టీ సాధించి మళ్ళీ అధికారం చేజిక్కించుకొంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా చెపుతున్నారు. ఒకపక్క సిఎం కేసీఆర్ దేశంలో కాంగ్రెస్, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా ఒక ఫ్రంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుంటే, మరోపక్క ఏపీ సిఎం చంద్రబాబునాయుడు కూడా మోడీని గద్దె దించేందుకు కాంగ్రెస్ నేతృత్వంలో ఒక ఫ్రంట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. 

కేసిఆర్ ఏర్పాటు చేస్తున్న కూటమిలో ప్రధానమంత్రి అభ్యర్ధి ఎవరో ఇంకా తెలియదు కానీ కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటవుతున్న కూటమిలో ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్ధిగా ఉండబోతున్నారని స్పష్టం అయ్యింది. 

అయితే కొన్ని నెలల క్రితం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ, “అప్రజాస్వామిక పాలన చేస్తున్న నరేంద్ర మోడీని గద్దె దించి కాంగ్రెస్ మిత్రపక్షాలను అధికారంలోకి తీసుకువచ్చేందుకు అవసరమైతే నేను ప్రధానమంత్రి రేసు నుంచి తప్పుకోవడానికి సిద్దం. ఆ పదవిని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేదా మరెవరైనా చేపట్టవచ్చు. వారికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది,” అని చెప్పారు. రాహుల్ గాంధీ ఆ మాట చెప్పినప్పటి నుంచి       మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పనిచేయడానికి ముందుకు వచ్చారు. 

కానీ ఇటీవల చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో దేశంలో ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు ప్రయత్నించినప్పుడు మళ్ళీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా ప్రొజెక్ట్ చేయడంతో ప్రధానమంత్రి పదవిపై ఆశలు పెంచుకొన్న మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీకి దూరం కాసాగారు. ఆమెను తమ కూటమిలో చేర్చుకోవడానికి కేసిఆర్, చంద్రబాబునాయుడు ఇద్దరూ ప్రయత్నిస్తున్నారు. కానీ ఆమె ఇంతవరకు ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. 

కానీ ఆమె తన మనసులో కోరికను తన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ద్వారా అధికారికంగా ప్రకటింపజేసేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో తమ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ప్రధానమంత్రి అని ఆ పార్టీ నిన్న ప్రకటించేసింది. కనుక ఆమె విధించిన ఈ షరతుకు ఇప్పుడు కేసిఆర్, చంద్రబాబునాయుడు ఇద్దరిలో ఎవరు అంగీకరిస్తే వారితోనే ఆమె కలిసి పనిచేస్తారని తేల్చి చెప్పినట్లయింది. ఇప్పుడు బంతి కేసిఆర్, చంద్రబాబునాయుడు కోర్టులోనే ఉంది కనుక ఇప్పుడు ఏమి చేయాలో వారే నిర్ణయించుకోవలసి ఉంది. 


Related Post