జగ్గారెడ్డి నాలుగేళ్ళు...రేవంత్ రెండేళ్ళు!

December 31, 2018


img

అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలైన కాంగ్రెస్ నేతలు ఇంకా ఆ షాక్ నుంచి తేరుకొన్నట్లు లేదు. తేరుకొన్నా చాలా మంది మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఓటమి పాలైన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేరుకొని తాను నల్గొండ నుంచి లోక్‌సభకు పోటీ చేయాలనుకొంటున్నట్లు ప్రకటించగా, సంగారెడ్డి నుంచి గెలిచిన జగ్గారెడ్డి తాను నాలుగేళ్ళవరకు సిఎం కేసీఆర్, తెరాస ప్రభుత్వంపై ఎటువంటి విమర్శలు చేయనని ప్రకటించారు. కొడంగల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రెండేళ్ళ వరకు మీడియాతో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నారు. ఇన్నాళ్ళు నేను మీ అందరి కోసం మాట్లాడేను కానీ ఇప్పుడు నా కోసం మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను,” అని చెప్పారు. 

మరొక 10 రోజులలో పంచాయతీ ఎన్నికలు జరుగబోతుంటే కాంగ్రెస్ నేతలు ఇంతగా నైరాశ్యంలో కూరుకొనిపోవడంతో రాష్ట్రంలో తెరాసకు పోటీ ఇచ్చేవారే లేకుండాపోయారు. కనుక పంచాయతీ ఎన్నికలలో తెరాస బలపరిచిన అభ్యర్ధులు అవలీలగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ మూడు బిజెపి పాలిత రాష్ట్రాలను చేజిక్కించుకొని అధికారంలోకి రావడంతో చాలా ఆత్మవిశ్వాసంతో, మంచి హుషారుగా లోక్‌సభ ఎన్నికలకు సిద్దం అవుతుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఆశావహమైన పరిస్థితులు కనిపిస్తున్నందున జాతీయస్థాయిలో చురుకుగా ఉంది కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నందునే రాష్ట్ర కాంగ్రెస్ నేతలలో ఇంత నైరాశ్యం నెలకొని ఉందని చెప్పవచ్చు. లోక్‌సభ ఎన్నికల నాటికైనా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఈ ఓటమి షాక్ నుంచి కొలుకొంటారో లేదో?



Related Post