తనదాక వస్తేగానీ నొప్పి తెలియదేమో?

December 28, 2018


img

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో సుమారు 22 లక్షల మంది ఓటర్ల పేర్లు జాబితాలో గల్లంతయ్యాయని, ఈవీఎంల ట్యాంపరింగ్, వీప్యాట్ రసీదుల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించినప్పుడు, తెరాస నేతలు వారిని చాలా అవహేళన చేస్తూ మాట్లాడారు. ఎన్నికల సంఘం చాలా దివ్యంగా పనిచేసిందని చెపుతూ అందుకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు కూడా. కానీ సిఎం కేసీఆర్‌ నిన్న డిల్లీలో కేంద్ర ఎన్నికల కమీషనర్ సునీల్ అరోరాను కలిసి అనేక పిర్యాదులు, సూచనలు చేశారు. 

అసెంబ్లీ ఎన్నికలలో ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీకి ‘ట్రక్కు’ గుర్తు, స్వతంత్ర అభ్యర్ధులకు కెమెరా, ఇస్త్రీ పెట్టె, టోపీ వంటి గుర్తులు కేటాయించడంతో గ్రామాలలో నిరక్షరాస్యులు తికమకపడి కారు గుర్తుకు బదులు వాటికి ఓట్లు వేశారని తెలిపారు. దాని వలన 15 మంది తెరాస అభ్యర్థులు 1,000 నుంచి 15,000 ఓట్లు నష్టపోయారని, ఆ కారణంగా 100 సీట్లు గెలుచుకోవలసిన తాము కేవలం 88 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగామని కేసీఆర్‌ చెప్పారు. కనుక వచ్చే లోక్‌సభ ఎన్నికలలో ఎవరికీ కారును పోలిన గుర్తులు కేటాయించవద్దని కేసీఆర్‌ ఎన్నికల కమీషనరును కోరారు. అలాగే ఈవీఎంలలో తమ కారు గుర్తు మరింత స్పష్టంగా కనబడేవిధంగా దానికి మరింత ముదురురంగుఇవ్వాలని కోరారు.            

ఇక ఓటర్ల జాబితాలో సుమారు 22 లక్షలమంది పేర్లు గల్లంతవడం వలన కూడా తమ పార్టీ తీవ్రంగా నష్టపోయిందని సిఎం కేసీఆర్‌ ఫిర్యాదు చేశారు. కనుక వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి తొలగించిన ఓటర్ల పేర్లను మళ్ళీ జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని సిఎం కేసీఆర్‌ కోరారు. కేసీఆర్‌ అభ్యర్ధనలు, పిర్యాదులపై ఎన్నికల కమీషనర్ సునీల్ అరోరా సానుకూలంగా స్పందించారు. 

ఎన్నికలలో గెలుపొందిన పార్టీ ఎన్నికల సంఘం చేసిన పొరపాట్ల వలన 12 సీట్లు నష్టపోయామని బాధపడుతున్నప్పుడు, ఈసారి కనీసం 80-85 సీట్లు గెలుచుకొంటామని భావించిన కాంగ్రెస్ పార్టీకి కేవలం 20 సీట్లే వచ్చినప్పుడు అది ఎంత బాధపది ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. కాంగ్రెస్ నేతలు తమ బాధను, ఆవేదనను వ్యక్తం చేసినప్పుడు వారిని అవహేళన చేసిన తెరాస ఇప్పుడు తన బాధను ఎన్నికల సంఘం అర్ధం చేసుకోవాలని, తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కోరడం విడ్డూరంగా ఉంది. అందుకే అన్నారు పెద్దలు తనదాక వస్తే కానీ ఆ నొప్పి తెలియదని! 


Related Post