రాజకీయ సన్యాసం చేయడం లేదట!

December 11, 2018


img

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కొడంగల్‌ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్‌ ఫైర్ బ్రాండ్ లీడర్ రేవంత్‌రెడ్డి తెరాస అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.

ఓటమి తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, “రాజకీయాలలో గెలుపోటములు సహజమే. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి వంటి మహామహులే ఎన్నికలలో ఓడారు..గెలిచారు. గెలిస్తే పొంగిపోను. ఓడిపోతే క్రుంగిపోను. గెలుపోటములను సమానంగా స్వీకరించగల ధైర్యం నాకుంది. కనుక నేను గెలిచినా ఓడినా నిరంతరం ప్రజాసమస్యలపై ప్రభుత్వంతో పోరాడుతూనే ఉంటాను. తెరాస గెలుపును నేను అంగీకరిస్తున్నాను. కానీ అది ఏవిధంగా గెలిచిందనేది ప్రజలందరూ చూశారు. ఏదో విధంగా గెలిచింది కనుక ఇకనైనా రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తే మంచిది. అలాగే గత ఎన్నికలతో పాటు ఈ ఎన్నికలలో కొత్తగా ఇచ్చిన హామీలను కూడా అమలుచేయాలని కోరుకొంటున్నాను. గెలిచినంత మాత్రన్న ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే చూస్తూ ఊరుకోబోము,” అని అన్నారు. 

ఎన్నికలలో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని చేసిన శపధం గురించి ఒక విలేఖరి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా “ఎన్నికలకు ముందు కేటిఆర్‌ నా సవాలును స్వీకరించి ఉండి ఉంటే నేను తప్పకుండా ఆ మాటకు కట్టుబడి ఉండేవాడిని కానీ ఆయన స్పందించలేదు కనుక అది నాకు వర్తించదు,” అని అన్నారు.   



Related Post