ఆర్.బి.ఐ.లో మళ్ళీ వికెట్ పడింది

December 10, 2018


img

రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జీత్ పటేల్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. కేంద్ర ఆర్ధికమంత్రికి పంపిన తన రాజీనామా లేఖలో కేవలం వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉర్జిత్‌ పటేల్‌కు ముందు రఘురామ రాజన్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా వ్యవహరించారు. బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఆయనపై చాలా అనుచిత విమర్శలు, ఆరోపణలు చేసేవారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ ఏనాడూ ఆయనను మందలించలేదు. ఆ అవమానాలను దిగమింగుకొంటూనే రఘురామ రాజన్ తన పదవీకాలం పూర్తికాగానే తప్పుకొన్నారు. 

ఆయన తరువాత 2016లో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జీత్ పటేల్ మళ్ళీ అటువంటి పరిస్థితులలోనే నేడు రాజీనామా చేశారు. నోట్లరద్దు, జిఎస్టి రెండూ మోడీ ప్రభుత్వ నిర్ణయాలే అయినప్పటికీ, వాటి వలన ఉత్పన్నం అయిన అనేకానేక సమస్యలకు, కలిగిన నష్టాలకు ఉర్జీత్ పటేల్ నిందలు భరించవలసి వచ్చింది. చివరికి పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ (జేపీసీ) ఎదుట హాజరై దోషిలా వివరణ కూడా ఇచ్చుకోవలసి వచ్చింది. రెండుమూడు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం ఆర్‌బీఐపై నియంత్రణ సాధించేందుకు సెక్షన్‌ 7(ఎ) ప్రయోగించి, దాని తరువాత సెక్షన్ (బి)ని కూడా ప్రయోగించడానికి సిద్దపడింది. నిజానికి అప్పుడే ఉర్జీత్ పటేల్ రాజీనామా చేయడానికి సిద్దపడ్డారు. కానీ ప్రభుత్వ పెద్దలు నచ్చజెప్పడంతో వెనక్కు తగ్గారు. 

ఇన్ని అవమానాలు ఎదుర్కొన్నా ఏనాడూ ఆయన నోట్లరద్దు తన నిర్ణయం కాదని, దానికి తాను బాధ్యుడిని కానని వాదించే ప్రయత్నం చేయలేదు. తనను తాను సమర్ధించుకొనే ప్రయత్నం చేయలేదు. కానీ నోట్లరద్దు తదనంతర పరిణామాలకు నేడు ఆయన తన రాజీనామాతో మూల్యం చెల్లించారు. దీంతో నాలుగున్నరేళ్ల మోడీ పాలనలో రిజర్వ్ బ్యాంకు రెండు వికెట్లు పడ్డాయి. 

ఆర్.బి.ఐ.లో జరుగుతున్న ఈ అవాంఛనీయ పరిణామాలను చూసి ఆర్ధిక నిపుణులు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ ఆర్ధికవ్యవస్థను, బ్యాంకింగ్ వ్యవస్థను నియంత్రించే అత్యున్నత పదవిలో ఉన్న గవర్నర్లు ఈవిధంగా అత్యంత అవమానకర పరిస్థితులలో బయటకు వెళుతుండటం దేశఆర్ధిక వ్యవస్థ పట్ల యావత్ ప్రపంచానికి తప్పుడు సంకేతాలు పంపుతాయని చెప్పకతప్పదు. 


Related Post