హంగ్ ఏర్పడితే బిజెపి మద్దతు ఎవరికి?

December 06, 2018


img

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి మొత్తం 119 స్థానాలకు పోటీ చేసింది. ‘మార్పు కోసం’ అనే నినాదంతో ఎన్నికల ప్రచారం చేసిన బిజెపి ఈ ఎన్నికలలో గెలిచి రాష్ట్రంలోకి అధికారంలోకి వస్తామని చెప్పుకొంది. అయితే బిజెపి అధికార ప్రతినిధి జివిఎల్ఎన్ రావు రెండు వారాల క్రితమే మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో హాంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని” జోస్యం చెప్పారు. తెరాస మిత్రపక్షంగా ఉన్న మజ్లీస్ పార్టీ కూడా “మేము ప్రభుత్వంలో చేరము కానీ మా మద్దతు లేనిదే ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదంటూ” హంగ్ అవకాశాలున్నాయని చెప్పకనే చెప్పారు. 

అయితే ప్రజలు ఏదో ఒక పార్టీ లేదా కూటమికి పూర్తి మెజారిటీతో అధికారం కట్టబెడితే ఏ సమస్యాలేదు కానీ ఒకవేళ హంగ్ ఏర్పడితే మజ్లీస్, బిజెపిలు ఎవరికి మద్దతు ఇస్తాయనే సందేహం కలుగుతుంది. 

ఈవిషయంలో మజ్లీస్ పార్టీకి ఏ సమస్యా లేదు. ఒకవేళ హంగ్ ఏర్పడితే దాని మొట్టమొదటి ఛాయిస్ తెరాస అని వేరే చెప్పనవసరం లేదు. ఒకవేళ ప్రజాకూటమికి ప్రభుత్వ ఏర్పాటు చేయగల అవకాశం ఉన్నట్లయితే దానికి మద్దతు ఇవ్వడానికి మజ్లీస్ పార్టీకి ఎటువంటి అభ్యంతరం ఉండదు. అదేవిధంగా ఈ రెండూ కాక బిఎల్ఎఫ్ లేదా మరే పార్టీకైనా మద్దతు ఇవ్వడానికి మజ్లీస్ పార్టీకి ఇబ్బంది ఉండదు.

కానీ హంగ్ ఏర్పడితే ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే పార్టీలకంటే ‘కింగ్ మేకర్’ గా నిలువాల్సిన బిజెపికే నిర్ణయం తీసుకోవడం కొంచెం కష్టం కావచ్చు. తెరాసకు మద్దతు ఇస్తే ఆ రెండు పార్టీల మద్య రహస్య అవగాహన ఉందనే ప్రతిపక్షపార్టీల వాదనకు బలం చేకూరుతుంది. బిజెపికి కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ శత్రువు కనుక దానికీ మద్దతు ఈయలేదు. కానీ అటువంటి పరిస్థితే ఏర్పడితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ (ప్రజాకూటమి) అధికారంలోకి రాకుండా అడ్డుకొనేందుకు బిజెపి తెరాస లేదా బిఎల్ఎఫ్ దేనికైనా మద్దతు ఈయడానికి వెనుకాడకపోవచ్చు. 

రాష్ట్రంలో ఇటువంటి అస్థిర రాజకీయపరిస్థితులు ఏర్పడకుండా నివారించగల శక్తి కేవలం రాష్ట్ర ప్రజలకు మాత్రమే ఉంది. కనుక అందరూ ఆలోచించి ఓటు వేయవలసిన అవసరం ఉంది. 


Related Post