మహా రెబెల్స్... మహా సవాల్

November 17, 2018


img

 ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు వివిద పార్టీల మద్య చీలిపోకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ మహాకూటమిని ఏర్పాటు చేసుకొంది. మహాకూటమిలో నాలుగు పార్టీల ఓటు బ్యాంకులు కూడా ఒకదానికొకటి బదిలీ అవుతాయని లెక్కలు కట్టుకొంది. కాగితాల మీద ఈ లెక్కలు సరిగ్గానే కనిపిస్తున్నాయి. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకూడదనుకొంటే ఇప్పుడు కాంగ్రెస్‌ ఓట్లే చీలిపోయేలా ఉన్నాయి. 

మహాకూటమిలో పొత్తులలో భాగంగా మిత్రపక్షాలకు కాంగ్రెస్ పార్టీ 25 సీట్లు పంచిపెట్టవలసి వచ్చింది. కనుక ఆ మేరకు కాంగ్రెస్‌ పార్టీలో ఆశావాహులు టికెట్లు కోల్పోయారు. ఆవిధంగా టికెట్ దక్కనివారు కాంగ్రెస్ పార్టీలో సుమారు 40 మంది వరకు ఉన్నారు. వారందరూ రెబెల్ కాంగ్రెస్‌ అభ్యర్ధులుగా ఒకే గుర్తుపై పోటీ చేయడానికి సిద్దం అవుతున్నారు. వారిలో మర్రి శశిధర్ రెడ్డి, బోడ జనార్ధన్, విజయరామారావు, నాయిని రాజేందర్ రెడ్డి, భిక్షపతి యాదవ్, కార్తీక్ రెడ్డి వంటి అనేకమంది ప్రముఖ నేతలున్నారు. ఒకవేళ వారందరూ రెబెల్ కూటమిగా ఏర్పడి స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేస్తే ముందుగా నష్టపోయేది కాంగ్రెస్ పార్టీయే. దానికి పడవలసిన ఓట్లు రెబెల్స్ చీల్చుకొంటే కాంగ్రెస్ పార్టీ ఏ ప్రయోజనం ఆశించి మహాకూటమిని ఏర్పాటు చేసుకొందో అది నెరవేరదు. ఈ రెబెల్స్ వలన మహాకూటమిలో మిత్రపక్షాలు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి కొందరు మాత్రమే గెలిచినట్లయితే, మళ్ళీ 2015 నాటి పరిస్థితులు పునరావృతం కావచ్చు. మళ్ళీ తెరాసలోకి ఫిరాయింపులు జరగడం తధ్యం. కనుక కాంగ్రెస్ పార్టీ ముందుగా రెబెల్ అభ్యర్ధులను బుజ్జగించి దారికి తెచ్చుకోవడం చాలా అవసరం.   



Related Post