కేసీఆర్‌ ఎన్నికల ప్రచారం ఆలస్యానికి కారణం ఏమిటంటే...

November 08, 2018


img

సెప్టెంబరు 6న శాసనసభను రద్దు చేసి ఒకేసారి 105 మంది అభ్యర్ధులను ప్రకటించిన తరువాత సిఎం కేసీఆర్‌ 50 రోజులలో 100 బహిరంగసభలలో పాల్గొంటారని చెప్పారు. కానీ రెండు నెలలలో కేవలం 5 సభలు మాత్రమే నిర్వహించారు. నవంబరు మొదటివారం నుంచి డిసెంబర్ 5వరకు ఏకధాటిగా బహిరంగసభలు నిర్వహిస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఒక్క సభ కూడా నిర్వహించలేదు. 

దీనిపై మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు మంత్రి కేటిఆర్‌ సమాధానమిస్తూ, “మేము ఒకేసారి 105 మంది అభ్యర్ధులను ప్రకటించడంతో ప్రతిపక్ష పార్టీలకు ఏమి చేయాలో పాలుపోని స్థితిలో మహాకూటమిని పెట్టుకొని సీట్లకోసం పట్లు పడుతున్నాయి. కనుక ప్రస్తుతం గ్రౌండ్ ఖాళీగా ఉంది. బ్యాటింగు, బౌలింగు, ఫీల్డింగు, అంపైరింగు...అన్ని మేమే చేసుకొంటున్నాము. ఈ పరిస్థితులలో సిఎం కేసీఆర్‌ వచ్చి ఎవరిని ఎదుర్కోవాలి?అందుకే ఆయన సభలు వాయిదా వేసుకొన్నారు. ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి మా మంత్రులు, మా పార్టీ అభ్యర్ధులు, పార్టీ నేతలు చాలు. మహాకూటమిలో సీట్ల పంపకాలు ముగించుకొని ఆ పార్టీ నేతలు ఎన్నికల ప్రచారానికి వస్తే, అప్పుడు మా అధినేత కేసీఆర్‌ కూడా వచ్చి వారిని ఎదుర్కొంటారు,” అని చెప్పారు. 

కేటిఆర్‌ చెప్పింది సహేతుకంగానే ఉంది. అయితే కేసీఆర్‌ సభలు వాయిదా పడుతుండటానికి ఇంకా అనేక ఇతర కారణాలు కూడా కనబడుతున్నాయి. కేసీఆర్‌ సభ అంటే భారీస్థాయి ఏర్పాట్లు చేయాలి. భారీగా జనసమీకరణ చేయాలి. మంత్రులు, నేతలు అందరూ దాని కోసం తమ ప్రచార కార్యక్రమాలు మానుకొని సభకు ఏర్పాట్లు చేయాలి. పైగా ఒక్కో సభకు భారీగా డబ్బు ఖర్చు అవుతుంది. మంత్రి కేటిఆర్‌ చెప్పినట్లు, బరిలో ప్రత్యర్దులే లేనప్పుడు ఇంత శ్రమ, సమయం, డబ్బు ఖర్చు చేయడం వలన ఏ ఉపయోగం ఉండదు. పైగా జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారానికి స్వయంగా బ్రేకులు వేసుకొన్నట్లవుతుంది. బహుశః అందుకే సిఎం కేసీఆర్‌ తన బహిరంగసభలు వాయిదా వేసుకొని, ప్రగతిభవన్‌ నుంచి తెరాస ఎన్నికల ప్రచారాన్ని రోజూ సమీక్షిస్తూ తెరాస అభ్యర్ధులకు తగిన మార్గదర్శనం చేస్తూ, ఎన్నికలకు ముందు లభించిన ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకొంటున్నారు.


Related Post