మోడీని చూసి భయపడే కేసీఆర్‌...జెపి నడ్డా

October 15, 2018


img

కేంద్రమంత్రి మరియు రాష్ట్ర బిజెపి వ్యవహారాల ఇన్‌చార్జ్‌ జెపి నడ్డా హైదారాబాద్ పర్యటన సందర్భంగా సోమవారం మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణతో దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్రమోడీకి నానాటికీ ప్రజాధారణ పెరిగిపోతోంది. సిఎం కేసీఆర్‌ ఈ నాలుగేళ్ళలో అన్నివిధాలా వైఫల్యం చెందడంతో సార్వత్రిక ఎన్నికలలో ప్రధాని నరేంద్ర మోడీని ఎదుర్కోవడం కష్టమని ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారు. కేసీఆర్‌ పిచ్చి పాలనకు ఆయన మాట్లాడే మాటలే అద్ధం పడుతున్నాయి. తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొంటున్న సిఎం కేసీఆర్‌ ఈ నాలుగేళ్ళలో రాష్ట్రంలో 4,000 మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకొన్నారో దానికి ఎవరు బాధ్యులో చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని మాపై బురద జల్లుతున్న కేసీఆర్‌ ఆయుష్మాన్ భారత్ పధకం క్రింద కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మంజూరు చేసిన రూ.172 కోట్లు ఎందుకు ఉపయోగించుకోలేదో చెపితే బాగుంటుంది. కేసీఆర్‌ తన పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రం అమలుచేస్తున్న పధకాలను రాష్ట్రంలో అమలుచేయడం లేదు. కనుక దేశంలో బిజెపి పాలిత రాష్ట్రాలతో సమానంగా తెలంగాణ కూడా అభివృద్ధి చెందాలంటే ఈసారి ఎన్నికలలో బిజెపికి ఓటు వేసి గెలిపించాలి. బిజెపికి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అన్నీ రంగాలలో అభివృద్ధి చేసి పూర్తి పారదర్శకమైన పాలన అందిస్తాము,” అని చెప్పారు. 

గత నాలుగున్నరేళ్ళలో కెసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందిందని మెచ్చుకొని కేంద్ర ప్రభుత్వమే అనేక అవార్డులు బహుకరించింది. ఆ సంగతి జెపి నడ్డా మరిచిపోయినట్లున్నారు.   

ప్రధాని నరేంద్ర మోడీని చూసి కేసీఆర్‌ భయపడేవారైతే ముందస్తు ఎన్నికల గురించి అందరికంటే ముందుగా ఆయన మోడీతోనే ఎందుకు చర్చిస్తారు? సిఎం కెసిఆర్ ఇప్పుడు కేవలం శాసనసభకు మాత్రమే ఎన్నికలకు వెళుతున్నారనే సంగతి జెపి నడ్డా మరిచిపోయినట్లున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలలలో లోక్ సభ ఎన్నికలలో ప్రధాని నరేంద్ర మోడీని, బిజెపిని సిఎం కేసీఆర్‌ ఎదుర్కొకుండా చేతులు ముడుచుకొని కూర్చోరు కదా?

మోడీని చూసి సిఎం కేసీఆర్‌ భయపడుతున్నారని చెప్పుకోవడం గొప్పగానే ఉంది. కానీ ఒక ప్రధాని స్థాయి వ్యక్తి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో పోటీ పడుతున్నారని చెప్పుకోవడం ప్రధాని స్థాయిని దిగజార్చడం లేదా ముఖ్యమంత్రి స్థాయిని పెంచడమే కదా?కనుక బిజెపి నేతలు ప్రధాని నరేంద్ర మోడీ భజన చేస్తూ లేదా ఇటువంటి విమర్శలతో సిఎం కేసీఆర్‌ను ఎదుర్కోవాలని ప్రయత్నించడం కంటే బిజెపికి ఓటేస్తే ఏమి చేస్తారో చెప్పుకొంటే ఏమైనా ఫలితం ఉంటుంది.


Related Post