ఆ కుర్చీలో కూర్చోంటే ఎవరైనా అంతే...

September 22, 2018


img

మాయాబజార్ సినిమాలో సత్యపీఠంపై ఎవరు నుంచొన్నా వారి మనసులో ఆలోచనలు అప్రయత్నంగా బయటపెట్టేసినట్లు, పాక్ ప్రధానమంత్రి కుర్చీలో ఎవరు కూర్చొన్నా పాక్ వక్రబుద్ధినే ప్రదర్శిస్తుంటారు. పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధానికాక మునుపు భారత్ తో సత్సంబంధాలు కావాలని కోరుకొన్నారు. కానీ పట్టుమని 10 రోజులు ఆ కుర్చీలో కూర్చోగానే భారత్ పట్ల ఆయన వైఖరిలో పెనుమార్పు వచ్చేసింది. 

విదేశాంగ మంత్రుల స్థాయిలో భారత్ తో చర్చలు ప్రారంభిద్దామని ఇమ్రాన్ ఖాన్ ప్రధాని మోడీని కోరగానే ఆయన వెంటనే అంగీకరించారు. కానీ ఆ మరుసటి రోజే భారత్-పాక్ సరిహద్దుల వద్ద పాక్ సైనికులు భారత్ జవాను గొంతు కోసి హత్య చేయడం, పాక్ ప్రేరిత హిజ్బుల్ ఉగ్రవాదులు నలుగురు పోలీస్ అధికారులను కిడ్నాప్ చేసి అతికిరాతకంగా హత్యలు చేయడంతో పాక్ వైఖరిలో ఎటువంటి మార్పు లేదని భావించిన భారత్, పాకిస్తాన్ తో చర్చలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. 

దానిపై ఇమ్రాన్ ఖాన్ స్పందన చాలా దారుణంగా ఉంది. ప్రధాని మోడీని ఉద్దేశ్యించి, “నేను ఇరుదేశాలు శాంతి చర్చలు ప్రారంభించాలని పిలుపునిస్తే, భారత్ చాలా దురహంకారంతో ప్రతికూలంగా స్పందించింది. తక్కువ స్థాయి ఉన్న వ్యక్తులు ఉన్నత పదవులు అధిష్టిస్తే వారికి విశాల ప్రపంచాన్ని చూడగల దార్శనికత ఉండదు,” అని ట్వీట్ చేశారు. 

అంటే నరేంద్ర మోడీ ఒకప్పుడు బస్టాండులో టీ అమ్ముకొన్న తక్కువ స్థాయి వ్యక్తి అని, ఆయన తన స్థాయికి మించిన పదవి చేపట్టినందున సరైన ఆలోచన చేయలేకపోతున్నారని చెప్పడమే. ఒక దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ సాటి దేశ ప్రధానమంత్రి గురించి ఇంత చులకనగా మాట్లాడటం చాలా దారుణమే. అధికారం చేపట్టి నెలరోజులు కూడా కాకమునుపే ఇంత నోటిదురుసు ప్రదర్శించడం చూస్తే ఆయన కూడా నోరు పారేసుకోవడంలో గత పాక్ పాలకులకు ఏమాత్రం తీసిపోరని స్పష్టం అవుతోంది.


Related Post