గాంధీ భవన్‌లో టికెట్లు అమ్ముకొంటున్నారు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

August 21, 2018


img

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ ఈరోజు నోటీసు పంపించింది. ఆయన నిన్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రామచంద్ర కుంతియాపై చేసిన విమర్శలపై 48 గంటలలో వివరణ ఇవ్వాలని కోరుతూ షో-కాజ్ నోటీసు పంపించింది.

నోటీస్ అందుకోగానే రాజగోపాల్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తనకు నోటీసుకు జవాబు చెప్పడానికి రెండు రోజులు అక్కరలేదని రెండు గంటలలోనే జవాబు చెపుతున్నానంటూ మళ్ళీ కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డిలతో సహా పార్టీలో సీనియర్లను పరోక్షంగా దుమ్ము దులిపేశారు. తాను రాష్ట్రంలోని పార్టీ కార్యకర్తల మనోవేధనను ప్రతిభింబించానే తప్ప ఎవరినీ వ్యక్తిగతంగా దూషించాలనో లేక పార్టీకి నష్టం కలిగించాలనో కాదని అన్నారు.

గాంధీ భవన్‌లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి కెసిఆర్‌ను తిట్టేవాళ్ళకు, నిన్నగాక మొన్న ఇతర పార్టీల నుంచి వచ్చి కెసిఆర్‌ను బూతులు తిట్టేవారిని,  తప్ప తన వంటి యువనాయకులను పార్టీ పట్టించుకోదా? అని ప్రశ్నించారు. అసలు తనకు నోటీసులు ఇచ్చే అర్హత క్రమశిక్షణ కమిటీలో ఎవరికైనా ఉందా? అని ప్రశ్నించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కొందరు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు తప్పు దారి పట్టిస్తున్నారని ఆరోపించారు. గాంధీ భవన్‌లో పార్టీ పదవులు, టికెట్లు అమ్ముకొంటూ పార్టీకి తీరని నష్టం కలిగిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆరోపణ చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావలనే తాను తపిస్తున్నాను తప్ప పదవులు అధికారం కోసం కాదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిత్యం ప్రజల మద్య ఉండే తన వంటి యువనాయకులను ప్రోత్సహించాలని, నోటీసులు పంపించి మావంటివారిని బయటకు పంపించాలని చూడొద్దని హితవు పలికారు. టిఆర్ఎస్‌కు తిరుగులేదని చెప్పుకొంటున్న కెసిఆర్‌ 105 సీట్లు మాత్రమే ప్రకటించి మిగిలిన 14 సీట్లు ఎందుకు ఖాళీగా ఉంచారో అర్ధం చేసుకోవాలని అన్నారు.

గత నాలుగేళ్ళలో టిఆర్ఎస్‌ నుంచి ఎన్ని ఒత్తిళ్ళు, వేధింపులు ఎదురవుతున్నా కూడా కార్యకర్తలు అన్నిటినీ పంటి బిగువున భరిస్తున్నారని ఎందుకంటే ఈసారి ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే తమ కష్టాలన్నీ తీరిపోతాయనే ఆశతోనే అని అన్నారు. వారిని కాపాడుకొనేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా తన వంటి యువనాయకులు టిఆర్ఎస్‌తో ఎంతగానో పోరాడుతున్నామని, కానీ గాంధీ భవన్‌లో కూర్చొని మాట్లాడే నేతలకు ఇవేవీ కనబడవని, చూడరని వారికి ఎంతసేపు వారి స్వప్రయోజనాలే తప్ప పార్టీ ప్రయోజనాలు పట్టవని విమర్శించారు.

ఇటీవల పార్టీని వీడి టిఆర్ఎస్‌లో చేరిన సురేశ్ రెడ్డి పేరు కమిటీలో చేర్చడం ఒక తప్పు అయితే, కాంగ్రెస్‌ కమిటీలలో ఎవరెవరు ఉన్నారో అని కనీసం చూడనైనా చూడకుండా ఆ జాబితాను మీడియాకు అందజేయడానికి అర్ధం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర కాంగ్రెస్‌ అధిష్టానం పనితీరు ఏవిధంగా ఉందో అది అద్దం పడుతోందని అన్నారు.

ఒక్కో కమిటీలో 40-50 మంది నాయకుల పేర్లను చేర్చి ఏమి సాధించాలనుకొంటున్నారని ప్రశ్నించారు. అంతా మంది సభ్యులు ఉంటే వారు కొట్టుకోవడానికే సరిపోతుందని ఇక ఎన్నికలు, పార్టీ గెలుపు గురించి ఆలోచించే తీరిక వారికి ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. అయినా కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏమేమి హామీలు అమలుచేస్తుందో ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని చెప్పేశాక ఇంకా మేనిఫెస్టో కమిటీ ఎందుకు? అదేమీ చేస్తుందిప్పుడు? అని ప్రశ్నించారు.    

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గత నాలుగేళ్ళుగా ఎందుకు కోలుకుపోలేతోందో ఆలోచించని ముసలినేతలు ఇంట్లో కూర్చోని కృష్ణా రామా అంటూ కాలక్షేపం చేయకుండా ఆరోగ్యం సహకరించకపోయినా మళ్ళీ ఎన్నికలు రాగానే ముఖ్యమంత్రి పదవి తమకే ఇవ్వాలని కోరుతూ ముందుకు వచ్చేస్తున్నారని అన్నారు.

పార్టీ అధికారంలోకి వచ్చేక ముఖ్యమంత్రి పదవితో సహా అన్ని పదవులు మీరే తీసుకోవచ్చు కానీ 2014 ఎన్నికలలో మాదిరిగానే ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్‌ నాయకుల తప్పిదాల వలన ఓటమి పాలుకాకుండా జాగ్రత్తపడాలని రాజగోపాల్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్‌ అధిష్టానాన్ని హెచ్చరించారు. కనీసం ఇప్పటికైనా రాష్ట్ర కాంగ్రెస్‌ అధిష్టానం కళ్ళు తెరిచి తాము చేస్తున్నది తప్పో ఒప్పో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంకా అనేక సమస్యలను, అంశాలను ప్రస్తావించి రాష్ట్ర కాంగ్రెస్‌ అధిష్టానాన్ని ఒక దుమ్ము దులిపేశారు. బహుశః దీంతో ఆయనకు కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు తెగిపోవచ్చు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని రేపు గాంధీ భవన్‌ నుంచి ప్రకటన వెలువడినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే నల్గొండ కిల్లా టిఆర్ఎస్‌ హస్తగతం కావడం తధ్యం. 


Related Post