ఓదెలు అందుకే వెనక్కు తగ్గారా?

September 14, 2018


img

చెన్నూరు మాజీ టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు ఈసారి టికెట్ ఇవ్వకుండా ఆయన స్థానంలో ఎంపి బాల్కా సుమన్ కు టికెట్ కేటాయించినందుకు ఆయన తీవ్ర అసంతృప్తితో ఆగ్రహంతో రగిలిపోయారు. సిఎం కెసిఆర్‌ నిన్న ఆయనను తన కార్యాలయానికి పిలిపించుకొని మాట్లాడిన తరువాత  ఓదేలు మెత్తబడ్డారు. 

సిఎంతో సమావేశం ముగిసిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, “నాకు, నా అనుచరులకు సిఎం కెసిఆర్‌ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొనే పార్టీ అభ్యర్ధులను ఖరారు చేయడం జరిగిందని కనుక పార్టీ అభ్యర్ధి (బాల్క సుమన్) గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. పార్టీ అభ్యర్ధులు అందరూ గెలిస్తేనే తాను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానని సిఎం కెసిఆర్‌ చెప్పారు. సిఎం కెసిఆర్‌ ఆదేశాలు నాకు శిరోధార్యం. ఆయనతో చిరకాలం పార్టీలో కలిసి పనిచేసేందుకు నేను దేనికైనా సిద్దమే. కనుక టిఆర్ఎస్‌ అభ్యర్ధి విజయానికి అందరూ కృషి చేయాలని నేను నా అనుచరులందరికీ విజ్నప్తి చేస్తున్నాను,” అని అన్నారు. 

అయితే బాల్క సుమన్ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించి, సుమన్ చరిత్రను బయటపెడతానని బెదిరించిన నల్లాల ఓదేలు హటాత్తుగా ఎందుకు మెత్తబడ్డారు? ఎందుకు వెనక్కు తగ్గారు? సిఎం నచ్చజెప్పడం వలననేనా? అంటే కాదనే అనిపిస్తోంది. 

బాల్క సుమన్ పర్యటన సందర్భంగా ఓదేలు అనుచరుడు గట్టయ్య ఆత్మహత్యా ప్రయత్నం చేసుకొన్నప్పుడు  సుమన్ పై కూడా పెట్రోల్ చల్లి అతనికీ నిప్పంటించే ప్రయత్నం చేశాడు కానీ సుమన్ తప్పించుకోగలిగారు. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న కొందరు మహిళలు, పోలీసులకు ఆ మంటలు అంటుకొని స్వల్పంగా గాయపడ్డారు. ఆత్మహత్యా ప్రయత్నం చేసుకొన్న గట్టయ్య “ఓదేలుకు జై ఓదెలుకు టికెట్ ఇవ్వాలి,” అంటూ నినాదాలు కూడా చేశాడు. కనుక ఇదంతా ఓదేలు ప్రోత్సాహంతోనే జరిగిందనే అర్ధమవుతోంది. అందుకే ‘ఓదేలు అనుచరులు తనపై హత్యాప్రయత్నం చేశారని’ సుమన్ వెంటనే ఆరోపించగలిగారు. 

సుమన్ అనుచరుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఓదేలు, ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు. హత్యాప్రయత్నం కేసులో ఇరుకొంటే ఏమవుతుందో తేలికగానే ఊహించవచ్చు. స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయడం మాట ఏమో గానీ ముందు జైలుకు వెళ్ళవలసి వస్తుంది. ఇదే విషయం సిఎం కెసిఆర్‌ బహుశః ఓదేలుకు నిన్న వివరించి ఉండవచ్చు. బహుశః అందుకే ఓదేలు వెనక్కు తగ్గి తాను తీవ్రంగా వ్యతిరేకించిన బాల్క సుమన్ కు మద్దతు ప్రకటించినట్లు భావించవచ్చు. సిఎం కెసిఆర్‌ అతనికి న్యాయం చేస్తానని ముందే చెప్పారు. అయినా తిరుగుబాటుకి సిద్దమయ్యారు. కానీ అత్యుత్సాహంలో చేసిన చిన్న పొరపాటు వలన వెనక్కు తగ్గక తప్పలేదు. ఈ సంఘటన జరగకపోయుంటే ఓదేలు తప్పకుండా స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి ఉండేవారేమో?


Related Post