కాంగ్రెస్‌ సవాలును టిఆర్ఎస్‌ ఎలా ఎదుర్కొంటుందో?

August 16, 2018


img

వచ్చే ఎన్నికలలో  గెలుపే లక్ష్యంగా తెలంగాణా కాంగ్రెస్‌ పార్టీ అనేక హామీలను గుప్పిస్తోంది. రైతులకు ఒకేసారి రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ వాటిలో ఒకటి. అలాగే రాష్ట్రంలో పది లక్షల మందినిరుద్యోగులకు నెలకు రూ.3,000 చొప్పున నిరుద్యోగభృతిని ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ రెండు హామీలు ఆచరణ సాధ్యం కావని సిఎం కెసిఆర్‌ గట్టిగా వాదిస్తున్నారు. 

ఒకేసారి రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేయాలంటే రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగులకు ఆరు నెలలపాటు జీతాలు చెల్లింపులు నిలిపివేయాలని, అలాగే వివిద ప్రాజెక్టులకు, పధకాలకు బిల్లులు చెల్లింపులు నిలిపివేస్తేనే ఇది సాధ్యమని కెసిఆర్ వాదిస్తున్నారు. కనుక ఈ హామీని ఏవిధంగా అమలుచేయాలనుకొంటున్నారో చెప్పాలని ఆయన కాంగ్రెస్‌ నేతలను నిలదీస్తున్నారు. 

ఇక రాష్ట్రంలో నిరుద్యోగులు ఎందరున్నారో...వారిని ఏవిధంగా గుర్తించలో తెలియకుండా నిరుద్యోగభృతి ఏవిధంగా చెల్లిస్తారని సిఎం కెసిఆర్‌ ప్రశ్నిస్తున్నారు. ఆయన ప్రశ్నలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పలేదు కానీ నిన్న స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా మరో కొత్త పధకాన్ని ప్రకటించారు. 

రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వింతంతు మహిళలకు ప్రస్తుతం ఇస్తున్న రూ.1,000 పెన్షన్ ను రెట్టింపు చేసి నెలకు రూ.2,000 ఇస్తామని ప్రకటించారు. పెన్షన్ విధానంపై అధ్యయనం చేసేందుకు 42 మందితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశామని, దాని సిఫార్సు మేరకే ఈ హామీని ప్రకటిస్తున్నానని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికల మ్యానిఫెస్టోలో ఈ హామీని చేర్చబోతున్నామని ఆయన చెప్పారు.

ఎన్నికలకు ముందు అన్నీ పార్టీలు ఇటువంటి హామీలను ప్రకటిస్తుంటాయి. ఆ హామీలిస్తున్న పార్టీలు వాటి సాధ్యాసాధ్యాలను పట్టించుకోవు. ఎందుకంటే ఏవో ఒక హామీలు ఇచ్చి ప్రజలను ఆకట్టుకొని ఎన్నికలలో గెలిచి అధికారం చేజిక్కించుకోవడమే వాటి లక్ష్యం కనుక. అలాగే ప్రజలు కూడా వాటి సాధ్యాసాధ్యాలను పట్టించుకోకుండా వాటికే మొగ్గు చూపుతుంటారు. కనుక రాష్ట్ర కాంగ్రెస్‌ విసురుతున్న ఈ సవాళ్ళను టిఆర్ఎస్‌ ఏవిధంగా ఎదుర్కొంటుందో చూడాలి. 


Related Post