తెలంగాణాకు 5 విమానాశ్రయాలు: కేటిఆర్

July 20, 2018


img

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణా రాష్ట్రానికి కనీసం 5 కొత్త విమానాశ్రయాలు అవసరం ఉన్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖమంత్రి కేటిఆర్ అభిప్రాయపడ్డారు. వరంగల్, కొత్తగూడెం, రామగుండం, అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్ పల్లిలో విమానాశ్రయాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని కనుక వాటి కోసం ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇవేకాక నదీతీరాలు, రిజర్వాయర్ల సమీపంలో పర్యాటక ప్రాంతాలను, పుణ్యక్షేత్రాలను సులువుగా చేరుకొనేందుకు వీలుగా నీటిపై ల్యాండింగ్-టేకాఫ్ అయ్యే సి-ప్లేన్స్ నడిపించేందుకు రాష్ట్రంలో ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో అధ్యయనం చేసి ఒక నివేదిక తయారుచేయాలని మంత్రి కేటిఆర్ ఆదేశించారు. అలాగే హెలికాఫ్టర్ సర్వీసులు నడిపేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలను కూడా గుర్తించాలని కోరారు. 

ముఖ్యంగా కేంద్రప్రభుత్వం ప్రకటించిన ‘ఉడాన్’ పధకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అధికారులు కృషి చేయలని కేటిఆర్ కోరారు.

కొత్తగూడెం వద్ద విమానాశ్రయం ఏర్పాటు కోసం కేంద్రబృందం ఇప్పటికే ఆ ప్రాంతాన్ని సందర్శించి నివేదిక సిద్దం చేస్తోందని, దానిని సాధించుకొనేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని అన్నారు. అలాగే వరంగల్ మామునూరులో విమానాశ్రయం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 750 ఎకరాల స్థలం ఇచ్చేందుకు సిద్దంగా ఉందని అవసరమైతే ఇంకా స్థలం అందించడానికి వెనుకాడబోమని కేటిఆర్ చెప్పారు. జూలై 27వ తేదీన వరంగల్ నగరంలోనే దీనిపై సమీక్షా సమావేశం నిర్వహిద్దామని మంత్రి కేటిఆర్ అధికారులకు సూచించారు.          

మంత్రి కేటిఆర్ నివాసంలో గురువారం జరిగిన ఈ సమావేశంలో టిఎస్.ఐ.ఐ.సి ఎండి వెంకటనర్శింహరెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్ రావు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.


Related Post