శుక్రవారమే అవిశ్వాసం...విప్ జారీ

July 18, 2018


img

ఊహించినట్లుగానే తెదేపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై పార్లమెంటులో చర్చకు మోడీ సర్కార్ వెంటనే ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 20వ తేదీన సభలో దానిపై చర్చ చేపట్టాలని నిర్ణయించింది. అందుకోసం అది తన ఎంపిలకు విప్ కూడా జారీ చేసింది. అవిశ్వాస తీర్మానంపై సభలో చర్చ జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా భాజపా ఎంపిలు అందరూ సభకు హాజరవ్వాలని లేకుంటే చర్యలు తప్పవని విప్ ద్వారా హెచ్చరించింది. 

సభలో వివిధ పార్టీల సభ్యుల సంఖ్య ఆధారంగా ఆయా పార్టీలకు సమయం కేటాయిస్తారు. సభలో భాజపాకే ఎక్కువ మంది సభ్యులున్నారు కనుక తన వాదన వినిపించేందుకే దానికే ఎక్కువ సమయం లభిస్తుంది. దాని తరువాత కాంగ్రెస్ పార్టీకి లభిస్తుంది. 

ఈ తీర్మానం ప్రవేశపెట్టిన తెదేపాకు గరిష్టంగా 20 నిముషాలు సమయం మాత్రమే లభించవచ్చు. కనుక ఆ కొద్దిపాటి సమయంలో మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా తాము అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రవేశపెట్టవలసి వచ్చిందో వివరించి పార్లమెంటులో కేంద్రాన్ని దోషిగా నిలబెట్టవలసి ఉంటుంది. 

అయితే ఆ చర్చలోనే ‘పాలకు పాలు...నీళ్ళకు నీళ్ళు వేరుచేసి చూపబోతున్నామని’ భాజపా కూడా ప్రకటించింది. అంటే ఈ నాలుగేళ్ళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులు, పధకాలు మంజూరు చేసిందో వివరించి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి తాము ఏపికి సహకరిస్తున్నప్పటికీ తెదేపా సర్కార్ అన్ని విధాల విఫలం చెందిందాని నిరూపించడానికి ప్రయత్నించవచ్చు. 

కనుక ఈ అవిశ్వాస తీర్మానంపై చర్చ అనే సాకుతో ఆ రెండు పార్టీలు ఒకదానిపై మరొకటి రాజకీయంగా పైచెయ్యి సాధించేందుకే పార్లమెంటు వేదికగా ఈ యుద్దానికి సిద్దపడుతున్నాయి తప్ప దాని వలన ఏపికి, ప్రజలకు ఎటువంటి ప్రయోజనమూ ఉండబోదు. 



Related Post