పార్లమెంటులో ఆందోళనలు తప్పవు: తెదేపా

July 11, 2018


img

జూలై 18 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలవబోతున్నాయి. గత సమావేశాలలో వివిధపార్టీ సభ్యుల అందోళనలు, అవిశ్వాస తీర్మానాల కారణంగా కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులపై, ప్రజాసమస్యలపై ఎటువంటి చర్చలు జరుపకుండానే సమావేశాలు ప్రతీరోజూ వాయిదాలు పడుతూ ముగిసిపోయాయి. కనుక ఈసారైన సభ్యులు అందరూ పద్ధతి ప్రకారం నడుచుకోవాలని కోరుతూ లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అందరికీ పేరుపేరునా లేఖలు వ్రాశారు. అయితే ఏపికి న్యాయం జరిగేవరకు పార్లమెంటులో తమ ఆందోళనలు కొనసాగుతాయని తెదేపా ఎంపి గల్లా జయదేవ్ మీడియాకు తెలిపారు. ఈసారి కూడా తాము మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. 

తెదేపా ముందే తన వ్యూహం బయటపెట్టింది కనుక దానిని అడ్డుకొనేందుకు మోడీ సర్కార్ కూడా ప్రయత్నించడం ఖాయం. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో కాంగ్రెస్, తెదేపాలు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టినప్పుడు, తెరాస, అన్నాడిఎంకె తదితర పార్టీ సభ్యులు వేర్వేరు డిమాండ్లతో సభలో ఆందోళనలు చేశారు. కనుక సభ ‘ఆర్డర్’ లో లేదనే సాకుతో ప్రతీరోజు సభను వాయిదావేస్తూ గండం గట్టెక్కింది. 

బడ్జెట్ సమావేశాలలో తెరాస సభ్యులు ఆందోళనలు చేస్తూ మోడీ సర్కార్ ను కాపాడే ప్రయత్నం చేశారని విమర్శలు రావడంతో అప్పుడే తెరాస సభ్యులు వెనక్కు తగ్గారు. భాజపా అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం తమిళనాడు పర్యటించినప్పుడు ఆయనకు తమిళప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవలసి వచ్చింది. కనుక ఈసారి తెరాస, డిఎంకె, అన్నాడిఎంకె సభ్యులు అవిశ్వాస తీర్మానాలకు అడ్డుపడకపోవచ్చు. కానీ అవిశ్వాస తీర్మానాలు చర్చకు రాకుండా చేసేందుకు మోడీ సర్కార్ ఏదో ఒక ఉపాయం చేయకమానదు. కనుక ఈసారి కూడా పార్లమెంటు సమావేశాలలో అర్ధవంతమైన చర్చలు జరుగుతాయని ఆశించడం అత్యసే అవుతుంది. 


Related Post