ఎన్.ఆర్.టి. టవర్స్ మరో హైటెక్ సిటీ అవుతుందా?

June 22, 2018


img

హైటెక్ సిటీని నిర్మించి హైదరాబాద్ ను ప్రపంచ ఐటిపఠంలో పెట్టిన ఏపి సిఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విభజన తరువాత ఏపిని కూడా ఐటి రంగంలో అభివృద్ధి చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అవేవి పెద్దగా ఫలించలేదు. రాష్ట్ర విభజన జరిగేనాటికే విశాఖపట్నంలో ఐటి రంగం నెలకొని ఉంది. కనీసం దానిని అభివృద్ధి చేసి కొత్త ఐటి సంస్థలను రప్పించలేకపోయారు. కారణాలు ఆయనకే తెలియాలి. నాలుగేళ్ళు గడిచిపోయి ఇక ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్న ఈ తరుణంలో చంద్రబాబు ఒక భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడం విశేషం. 

హైదరాబాద్ లో హైటెక్ సిటీకి ధీటుగా అమరావతిలోని రాయపూడి వద్ద ఎన్.ఆర్.టి. ఐకాన్ టవర్స్ భవనానికి ఏపి సిఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం శంఖుస్థాపన చేశారు. విదేశాలలో స్థిరపడిన తెలుగువారు కలిసి ఎన్.ఆర్.టి. (నాన్ రెసిడెంట్ తెలుగు ఇన్కార్పొరేషన్)ని ఏర్పాటు చేసుకున్నారు. వారు అందించిన రూ.500 కోట్లు విరాళాలతో రాయపూడిలో ఎన్.ఆర్.టి.భవనాన్ని ఏపి సర్కార్ నిర్మించబోతోంది. 

ఇంగ్లీషు అక్షరం ‘A’ ఆకారంలో రెండు టవర్లతో కూడిన 36 అంతస్తుల ఈ భవనంలో ఎన్.ఆర్.ఐ.లు ఐటి తదితర కంపెనీలను ఏర్పాటు చేసుకుంటారని చంద్రబాబు చెప్పారు. ఈ భవనం ప్రత్యేకత ఏమిటంటే దీనిలోనే ఉద్యోగుల నివాసాలు, వారికోసం షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, స్విమ్మింగ్ పూల్స్ వగైరా ఉంటాయి. 

అమరావతిలో ఒక్క శాశ్విత ప్రభుత్వం భవనమైనా కట్టకుండా నాలుగేళ్ళు కాలక్షేపం చేసేసిన చంద్రబాబు నాయుడు, తన పదవీ కాలం ముగుస్తున్న తరుణంలో ఈ భారీ కట్టడానికి శంఖుస్థాపన చేశారు. కనుక దీని నిర్మాణపనులు ఎప్పుడు మొదలుపెడతారో, అవెప్పుడు పూర్తవుతాయో ఎవరూ చెప్పలేరు. ఐటిరంగం బంగారుబాతు వంటిదని అందరి కంటే ముందే గుర్తించిన చంద్రబాబు నాయుడు ఇంతవరకు ఏపిలో దానిని అభివృద్ధి చేయలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.


Related Post