గ్రామీణప్రాంతాలలో టిజెఎస్ హల్ చల్?

June 18, 2018


img

ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన ఏర్పాటుచేయబడిన తెలంగాణా జనసమితి (టిజెఎస్) పట్టణాలలో కంటే గ్రామీణ ప్రాంతాలలో తన పట్టు పెంచుకోవడానికి గట్టిగా కృషిచేస్తునట్లుంది. పార్టీ ఆవిర్భావం తరువాత కోదండరాం వరుసగా వివిధ జిల్లాలలోని  గ్రామీణ ప్రాంతాలను పర్యటిస్తూ స్థానికులను పార్టీలో చేర్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అయన ఆదివారం మెదక్ జిల్లాలోని వెల్దుర్తి, చిన్నశంకరంపేట, మనోహరాబాద్ పరిధిలోని కాళ్ళకల్, కొల్చారంలోని వరిగుంట గ్రామాలలో తెలంగాణా జనసమితి జెండాలను ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “సుమారు 3 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించి ఇస్తామని చెప్పిన తెరాస సర్కార్ నాలుగేళ్ళు పూర్తయినా ఇంతవరకు 3,000 ఇళ్ళు కూడా ఇవ్వలేదు. కానీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం పేరు చెప్పుకొని రాష్ట్రంలో విచ్చలవిడిగా ఇసుక దోపిడీ సాగుతోంది. రాష్ట్రంలో 14 లక్షలమంది నిరుపేద కౌలురైతులు నానా కష్టాలు అనుభవిస్తూ ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తుంటే, సిఎం కెసిఆర్ వారిని కాదని బడా భూస్వాములకు, రాజకీయ నాయకులకు పంటపెట్టుబడి పేరుతో అప్పనంగా లక్షల రూపాయలు పంచిపెట్టారు. కడుపు మండిన ఆర్టీసి కార్మికులు వేతన సవరణ కోసం సమ్మె చేస్తామంటే, సమ్మె చేస్తే ఆర్టీసిని మూసేస్తామని సిఎం కెసిఆర్ బెదిరించడం అయన అహంకారానికి నిదర్శనం. తెలంగాణా ఏర్పడితే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆశిస్తే, కాంట్రాక్టర్లు, తెరాస నేతలు, భూస్వాములు మాత్రమే లబ్ది పొందుతున్నారు. రాష్ట్రంలో నిరంకుశ, అప్రజాస్వామికపాలన కొనసాగుతోంది. దానికి ముగింపు పలికేందుకు తెలంగాణా ప్రజలు ఎదురు చూస్తున్నారు. పంచాయితీ ఎన్నికలతో అది మొదలవుతుంది. కెసిఆర్ గద్దె దిగేరోజు త్వరలోనే రాబోతోంది,” అని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.


Related Post